శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 19 జనవరి 2016 (14:12 IST)

హెచ్‌సీయు క్యాంపస్ : 8 యేళ్ళలో 12 మంది విద్యార్థుల బలవన్మరణం

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యాసంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యాకుసుమాలు అర్థాంతరంగా రాలిపోతున్నాయి. గత ఎనిమిదేళ్ళలో 12 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ విద్యార్థుల వివరాలను పరిశీలిస్తే.. 
 
2009లో రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలరాజు... తెలుగులో పీహెచ్‌డీ చేస్తూ సొంత గ్రామానికి వెళ్లి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి బలవన్మరణానికి కూడా ఫ్యాకల్టీ వేధింపులే కారణం. 
 
గత 2008లో తమిళనాడుకు చెందిన సెంధిల్ కుమార్ భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తూ కెమికల్స్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రీసెర్చ్ స్కాలర్... భౌతిక విభాగానికి చెందిన ఫ్యాకల్టీ సిబ్బంది వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
2007లో కరీంనగర్ జిల్లాకు చెందిన కేశవాచారి తెలుగులో ఎంఫిల్ చేస్తూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పరిశోధనలో తలెత్తిన చిన్నపాటి సమస్యతో ఈ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
 
2007లో ఒరిస్సాకు చెందిన శివన్ నారాయణన్ పీహెచ్‌డీ పరిశోధన చేస్తూ సెలవులకు సొంతూరుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈతకు వెళ్లిన ఈ విద్యార్థి తిరిగి రాలేదు. అయితే, శివన్‌ది ప్రమాదమా, ఆత్మహత్యనా అనేది ఇప్పటివరకు తేలలేదు. 
 
2006లో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి లైఫ్ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విభాగంలోని పలువురు సీనియర్ విద్యార్థులు పెట్టిన వేధింపులను తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వరంగల్ జిల్లాకు చెందిన పూల్యాల రాజు అనే విద్యార్థి హెచ్‌సీయు హాస్టల్‌లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2013లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ చేస్తున్న లక్నోకు చెందిన మోహిని మిశ్రా అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అలాగే, 201లో గైడ్ వేధింపులు తాళలేక వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
నాలుగేళ్ళ క్రితం విశ్వవిద్యాలయం, సౌత్ క్యాంపస్‌లో ఉన్న నీటి కుంటలోకి ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఇది కూడా అత్మహత్యగానే భావిస్తున్నారు. ఇపుడు రోహిత్ వేముల హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.