శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (18:05 IST)

పాక్‌తో యుద్ధానికి మోడీ మంత్రం.. భారత్ చేతిలో కాశ్మీర్ ఆపిల్... పాక్ ఏం చేస్తుంది?

యూరీ ఘటన అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాలు తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటున్నాయి. యుద్ధానికి కూడా రెడీ అంటున్నాయి. భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య తరచూ ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనని ఇరు దే

యూరీ ఘటన అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాలు తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటున్నాయి. యుద్ధానికి కూడా రెడీ అంటున్నాయి. భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య తరచూ ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనని ఇరు దేశ సైనికులు సిద్ధంగా ఉన్నారు. బుధవారం రాత్రి భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఇందుకు సర్జికల్ స్ట్రైక్ విధానాన్ని ఎంచుకుంది.

ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకుని.. ఇతర ప్రాంతాలకు ఎలాంటి నష్టం కలగకుండా భారత్ సైన్యం చేపట్టిన దాడికి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలొస్తున్నాయి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు.. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రపంచ దేశాలు కూడా భారత్‌ వెంట మేమున్నామని ప్రకటించాయి. 
 
ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఎంత చెప్పినా వినకుండా ఉగ్రవాదులకు స్థావరంగా మారిపోవడంతో పాటు ఉగ్రమూకలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ప్రపంచ దేశాలు ఆ దేశంపై గుర్రుగా ఉండేందుకు కారణమైందని నిపుణులు అంటున్నారు.

ఇదే విషయాన్నే ప్రపంచ దేశాలకు ఆధారాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయటపెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమావేశాల్లో పాకిస్థాన్ తీరుపై ఆయన ఆధారాలతో కూడిన వివరాలను సమర్పించారు. ఇదంతా గమనించిన అమెరికా ఇప్పటికే భారత్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించింది. అగ్రరాజ్యం బాటలోనే ఇతర దేశాలు కూడా భారత్ వెంట వున్నామని ప్రకటిస్తున్నాయి. 
 
పాకిస్థాన్‌తో చెప్పి ప్రయోజనం లేదని అందుకే ఆ దేశంపై యుద్ధం చేపట్టి పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కా ప్లాన్ చేశారని.. పాక్‌తో యుద్ధమే సరైన మంత్రంగా భావిస్తున్నారని తెలిసింది. అందుకే ఉగ్రవాద స్థావరాలపై దాడికి పాల్పడి.. ఇండో-పాక్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొల్పి.. ఆపై దాయాది దేశంతో పోరుకు సిద్ధమవ్వాలని సైన్యంతో చెప్పేసినట్లు తెలుస్తోంది.

ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతేగాకుండా.. భారీ బలగాల సరిహద్దుల వద్ద మోహరించే ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. దీంతో పాకిస్థాన్ గతి అధోగతేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
ఇప్పటికే సరిహద్దుకు ఆవతల వైపు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడి గర్వకారణమంటూ దేశానికి చెందిన ప్రముఖులు, సెలెబ్రిటీలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. దేశం మొత్తం సైన్యం వెనుక నిలబడుతుందని ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్‌పై సునిశిత దాడులు చేసిన భారత్ సైన్యాన్ని చూసి గర్వపడుతున్నానని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తమ ట్వీట్లలో ‘భారత్ మాతాకీ జై.. యావత్తు దేశం సైన్యం వెనుక ఉంది’ అని ట్వీట్లు చేశారు.
 
పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో ఉన్న భార‌త రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న తీవ్ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పటికే స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రులంద‌రికీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాల‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌కు సూచిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
 
ఇదంతా చూస్తే.. దక్షిణాసియాలో భారత్-పాకిస్థాన్ దేశాలు మళ్లీ ఒకటైపోనున్నాయని ప్రచారం సాగుతోంది. అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్..  1947కు పూర్వం భారత అంతర్భాగం. 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్థాన్‌గా ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో ముహమ్మద్ అలీ జిన్నా ఒకరు. 
 
ఇక భారత్-పాకిస్థాన్‌ల మధ్య 1947 నుంచే కాశ్మీర్ వివాదం నడుస్తోంది. భారత్, పాకిస్థాన్, చైనా దేశాల మధ్య కాశ్మీర్ వివాదం తీవ్రంగా పరిగణించబడుతోంది. పాకిస్థాన్‌తో మూడు యుద్ధాలు (1947, 1965, 1999(కార్గిల్)), అలాగే భారత్, చైనా దేశాల మధ్య 1962 (బ్రిటిష్ వలస పాలన కాలములో భారత చైనాలను విడదీసే మెక్ మెహాన్ రేఖను చైనా గుర్తించనందుకు) యుద్ధానికి కాశ్మీరు వివాదమే కారణమైంది.
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారత్ వాదిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి చెందిన సగం మాత్రమే భారత దేశ ఆధీనంలో ఉంది. కాశ్మీర్ లోయలో కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమించింది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. కాశ్మీరులో భాగమైన గిల్గిత్‌-బెలూచిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్‌ 1947లో ఆక్రమించింది. ఇప్పటి వరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్‌ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్‌ చైనాకు అప్పగించింది. 
 
అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్‌ రవాణా మార్గంలో గిల్గిత్‌-బెలూచిస్థాన్‌ భూభాగం ఉంది. దక్షిణాసియా నైరుతిలో ఉన్న కాశ్మీర్ భూభాగం విషయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతు తెలపడం కూడా కాశ్మీర్ కోసమే. అయితే భారత్-పాకిస్థాన్‌ల మధ్య సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని ఈ కాశ్మీర్ సమస్యను కొలిక్కి తేవాలని నరేంద్ర మోడీ ప్లాన్ చేస్తున్నారు. 
 
చైనాకు చుక్కలు చూపించి.. పాకిస్థాన్‌పై యుద్ధం చేసి కాశ్మీర్‌ను కైవసం చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. అందుకే పాకిస్థాన్‌తో యుద్ధమే సరైన మార్గమని ఆయన అనుకుంటున్నారు. అలా యుద్ధం కుదరకపోతే.. పాకిస్థాన్‌ను ఏకాకి చేసి కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు పాకిస్థానే చర్చలకు వచ్చేలా చేసుకోవాలని మోడీ సన్నాహాలు చేస్తున్నారు. మరి మోడీ రాజతంత్రం ఏమేరకు పనిచేస్తుందో వేచి చూడాలి.