శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: శనివారం, 26 జులై 2014 (15:06 IST)

రుణ మాఫీపై వైసిపి రాంగ్ స్టెప్..? మద్దతు లేక బోర్లా పడిందా...?

ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి... ప్రజల తరఫున ఏదో ఒకటి చేయాలన్న ఆత్రుతతో వైసీపీ రాంగ్‌ స్టెప్స్‌ వేస్తోందా? పరిస్థితి చూస్తుంటే అందరికీ ఇదే డౌట్‌. రుణమాఫీ కోసం రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆ మేరకు పిలుపునిచ్చింది. మిగతా పార్టీల మద్దతు కూడా కోరింది. కానీ పార్టీలేవీ మద్దతివ్వకపోవడం చూస్తుంటే... రాంగ్‌ టైమింగేమో అన్న గుసగుసలు వైసీపీలో వినిపిస్తున్నాయి.
 
ప్రతిపక్షమనేది ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాల్సిందే. వేలుపెట్టే అవకాశం ఉన్నచోట టోటల్‌గా చెయ్యి పెట్టాల్సిందే. కానీ ఏకంగా తలే దూర్చేస్తే బొప్పి కట్టడం ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల కామెంట్. రుణమాఫీ... ఏపీ సర్కార్‌ను ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న వ్యవహారమై కూర్చుంది. రైతులు కూడా మాఫీ ఎంత కష్టమో అనేది తెలుసుకున్నారు. 
 
సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే అధికార పార్టీని మరింత ఇరుకున పెట్టాలని ప్రతిపక్షపార్టీ స్కెచ్‌ వేసింది. మొన్నటికిమొన్న నెల రోజుల గడువు ఇస్తున్నామని డెడ్ లైన్ ప్రకటించిన వైసీపీ... ప్రభుత్వానికి అంత వెసులుబాటు ఇవ్వొద్దని అనుకుందో ఏమో హడావుడిగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. రుణమాఫీపై మాటతప్పిన చంద్రబాబును ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామంటూ రంగంలోకి దిగింది. 
 
రుణమాఫీపై రణభేరి మోగిస్తూ మూడు రోజుల పాటు ప్రతీ గ్రామంలో నరకాసుర వధ పేరుతో బాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్‌. రుణమాఫీ పేరుతో జరుగుతున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను ఆదేశించారు. ఈ ఆందోళనకు రైతులు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
 
పార్టీ శ్రేణులకు, రైతులకు పిలుపునిచ్చిన జగన్‌... ఈ ఆందోళనకు లెఫ్ట్‌ పార్టీల మద్దతు కోరారు. ఇందులో భాగంగా లెఫ్ట్‌ పార్టీ నేతలైన రామకృష్ణ, మధులతో వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడారట. కానీ లెఫ్ట్‌ నేతల నుంచి ఊహించని రియాక్షన్‌ను ఫేస్‌ చేశారని సమాచారం. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మాట్లాడిన జగన్‌... ఆందోళనలో తమతో కలిసి రావాలని కోరారని సమాచారం. అయితే ఈ ఆందోళనలో తాము పాల్గొనలేమని రామకృష్ణ తేల్చిచెప్పేశారట. 
 
రుణమాఫీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో కొంత చేస్తున్నారు కదా అని స్పందించారట. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కూడా దాదాపు ఇదే రీతిలో స్పందించారట. ఇతర పార్టీలోనే కాదు... సొంత పార్టీలో కూడా నేతల నుంచి ఇలాంటి స్పందనే వస్తోందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు హడావుడిగా ఆందోళన కార్యక్రమాలు చేయడం ద్వారా పార్టీకి రాజకీయంగా ఒరిగేదేమీ లేదని వైసీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట.
 
ఇతర పార్టీల నుంచి మద్దతు రాకపోవడం, సొంత నేతలూ మొక్కుబడిగా ఉండటం చూస్తుంటే... వైసీపీ రాంగ్‌ టైమ్‌లో ఆందోళనకు పిలుపునిచ్చిందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మరోవైపు.... కొన్నిచోట్ల టీడీపీ శ్రేణులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నాయి. కడప జిల్లాతో పాటు పలుచోట్ల జగన్‌ దిష్టిబొమ్మల్ని టీడీపీ దహనం చేయడంతో పాటు, వైసీపీ నిరసనల్ని అడ్డుకోవడంతో ఈ రచ్చంతా అనవసరమనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోందట. 
 
కష్టకాలంలో ఎంతోకొంత మాఫీ అయితే అదే పదివేలన్న అభిప్రాయంతో సింహభాగం రైతులుండటంతో ఆ వర్గం నుంచి వైసీపీ నిరసనలకు పెద్దగా మద్దతు లభించే అవకాశం లేదంటున్నారు. నెలరోజుల టైమ్‌ ఇస్తున్నామని చెప్పి, వెంటనే నిరసనలకు పిలుపు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలోపెట్టే ఏకైక ఉద్దేశంతో వైసీపీ ఉందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశముందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందంటున్నారు. తొందరపాటుతో కాకుండా వేచిచూసే ధోరణే దీర్ఘకాలంలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందనే చర్చ పార్టీ నేతల్లో అంతర్గతంగా జరుగుతోందంటున్నారు.