గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 8 జనవరి 2018 (22:11 IST)

చంద్రబాబు సొంత జిల్లాలో పాగా వేసేందుకు జగన్ ప్లాన్?

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి పదునైన విమర్శలు చేస్తున్నారా... బాబు సొంత జిల్లాలో వైసిపి జెండాను ఎగుర వేయాలని ప్రయత్నిస్తున్నారా.. ముందస్తు ఎన్నికలకు జగన్ ముందే పక్కా ప్లాన్‌తో ముందుకెళుతున్నారా.. పాదయాత్రతో జగన్ వ్యూహమేంటి

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి పదునైన విమర్శలు చేస్తున్నారా... బాబు సొంత జిల్లాలో వైసిపి జెండాను ఎగుర వేయాలని ప్రయత్నిస్తున్నారా.. ముందస్తు ఎన్నికలకు జగన్ ముందే పక్కా ప్లాన్‌తో ముందుకెళుతున్నారా.. పాదయాత్రతో జగన్ వ్యూహమేంటి..? 
 
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పటికే మంత్రి నారా లోకేష్‌ స్వయంగా కుప్పం అభివృద్థి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కుప్పంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు భారీ మెజారిటీతో గెలుస్తారు. చంద్రబాబు నాయుడుపై ప్రజలకు ఉన్న నమ్మకం అలాంటిది మరి. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 14 నియోజకవర్గాల్లో ఏడుగురు వైసిపి ఎమ్మెల్యేలున్నా ఆ సంఖ్యను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు జగన్. తన పాదయాత్రతో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళి అధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు జగన్.
 
చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో పదునైన విమర్శలతో జగన్ ముందుకు సాగుతున్నారు. చిత్తూరు జిల్లాలో సాగు, తాగునీటిని అందించడంలో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు జగన్. అంతటితో ఆగడం లేదు అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటి వ్యక్తి చంద్రబాబేనంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 
 
ఒకవైపు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ మరోవైపు దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. బాబుపై విమర్సలు ఘాటుగా చేస్తున్నా, వై.ఎస్. చేసిన అభివృద్థి కార్యక్రమాలను వివరిస్తున్నా ప్రజలకు ఒక లెక్క ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.