శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 29 జులై 2015 (10:14 IST)

భారత్ ఓ రత్నాన్ని కోల్పోయింది : అబ్దుల్ కలాంపై నరేంద్ర మోడీ ప్రత్యేక వ్యాసం

భారతజాతి.. ఓ రత్నాన్ని కోల్పోయింది. కానీ, ఆ రత్నం నుంచి వెలుగు రేఖలు వస్తూనే ఉంటాయి... అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆ రత్నం.. అబ్దుల్ కలాం అయితే.. ఆయన అందించిన వైజ్ఞానం నుంచి నిత్యం వెలుగు రేఖలు వస్తూనే ఉంటాయన్నది మోడీ అభిప్రాయంగా ఉంది. అకాల మరణం చెందిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి ఓ ఆంగ్ల పత్రికకు మోడీ ప్రత్యేక వ్యాసం రాశారు.
 
 
ఇందులోని ముఖ్యాంశాలు కొన్ని ‘భారత్‌ను వైజ్ఞానిక సూపర్‌ పవర్‌ చూడాలి’ అనే అబ్దుల్‌ కలాం లక్ష్యాన్ని చేరేందుకు మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి. ఆయన మన ‘సైంటిస్ట్‌ ప్రెసిడెంట్‌’. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజల స్వచ్ఛమైన ప్రేమను పొందారు. భౌతికమైన అంశాలతో గెలుపును ముడిపెట్టకుండా ముందుకు సాగారు. ఆయన దృష్టిలో జ్ఞానమనే సంపదతోనే దారిద్య్రం నుంచి విముక్తి లభిస్తుంది.
 
కలాం ప్రవచించిన సిద్ధాంతం తిరుగులేనిది. ఎందుకంటే... వాస్తవాలే దానికి ప్రాతిపదిక. అణగారిన, ఆకలితో ఉన్న ప్రతిబాలుడూ వాస్తవికవాదే. ఎందుకంటే... పేదరికంలో ఉన్న వారికి భ్రమలు, కల్పనలుండవు. తన చదువుల కోసం ఆయన చిన్నప్పుడు పేపర్‌బాయ్‌గా పనిచేశారు. ఇప్పుడు... పత్రికలన్నీ ప్రతి పేజీలో ఆయన ఇకలేరనే వార్తలను ప్రచురించాయి. తాను నలుగురికి మార్గదర్శిగా మారాలని కలాం ఎప్పుడూ అనుకోలేదు. 
 
కలాం... నాకు మార్గదర్శకుడు. నాకేకాదు... ప్రతి చిన్నారికీ ఆయన మార్గదర్శి. కలాం గుణశీలత, నిబద్ధత, స్ఫూర్తిదాయక దృక్పథం ఆయన జీవితంలోని ప్రతిక్షణం ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఆయనకు అహం అనే అడ్డంకుల్లేవు. పొగడ్తలతో పొంగిపోరు. తన ముందున్నది విద్యార్థులైనా, మహామహా నేతలు, మంత్రులే అయినా... ఆయన ముఖం మాత్రం ఒకేరకంగా వెలిగిపోతూనే ఉంటుంది. 
 
మన సంస్కృతీ చెప్పే దామ (సహనం), దాన (త్యాగం), దయ గుణాలకు ఆయన ప్రతిరూపం. దేశం పట్ల ఆయన దృక్పథం స్వేచ్ఛ, అభివృద్ధి, బలం... అనే మూడింటితోనే ముడిపడింది. కలాం దృష్టిలో బలం అంటే... దాడికి దిగేది కాదు. అది గౌరవానికి సంబంధించింది. మనం బలవంతులమైతే ఇతరుల గౌరవాన్ని పొందగలం. అణు, అంతరిక్ష రంగాల్లో ఆయన సాధించినపెట్టిన విజయాలు భారత్‌కు ఇలాంటి బలాన్ని ఇచ్చాయి. ప్రపంచంలో మనకు ఓ చోటును సాధించిపెట్టాయి. 
 
కలాంజీ... చెట్ల కొమ్మల కదలికల్లో కవిత్వం విన్నారు. నీటిలో, గాలిలో, సూర్యుడిలో శక్తినికన్నారు. మనమంతా ప్రపంచాన్ని ఆయన కళ్లతో చూడటం నేర్చుకోవాలి. సంకల్పం, పట్టుదల, సామర్థ్యం, సాహసం... వీటితో మనిషి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. కానీ... మన ఎప్పుడు ఎక్కడ పుట్టాలి... ఎప్పుడు, ఎక్కడ మరణించాలి అనేది మాత్రం మన చేతుల్లో ఉండదు. ఒకవేళ కలాంజీకి తన మరణం ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించి ఉంటే, వాటినీ ఉపయోగించేవారు. 
 
మంగళవారం కలాం నివాసంలో ఆయన భౌతికకాయం ఉంచిన గదిలో అడుగుపెట్టగానే, నాకు ఒక చిత్రం కనిపించింది. దానిపై ‘ఇగ్నైటెడ్‌ మైండ్స్‌’లో పిల్లలకోసం కొన్ని వ్యాక్యాలు రాసి ఉన్నాయి. ఆయన శరీరం సమాధి అయినప్పటికీ.. ఆయన జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవు. పిల్లలు తమ జీవితాంతం వాటిని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. వాటిని తమ పిల్లలకు బహుమతిగా అందిస్తారు అని మోడీ పేర్కొన్నారు.