శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శనివారం, 11 జులై 2015 (13:34 IST)

గవర్నర్‌ ఇఫ్తార్ విందు.. కేసీఆర్, బాబు డుమ్మా.. కేసీఆర్ ఎందుకలా చేశారు..?!!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ డుమ్మా కొట్టారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్‌లో ఈ విందుకు ఏపీ, తెలంగాణలకు చెందిన డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, మహమూద్ అలీలతో పాటు అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. 
 
జపాన్ టూర్ ముగించుకుని వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. అనివార్య కారణాల వల్లే గవర్నర్ ఇఫ్తార్ విందుకు హాజరుకాలేకపోతున్నానని బాబు ప్రకటించారు. 
 
అయితే ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారని మొన్న తెలంగాణ సీఎంఓ ప్రకటించింది. అయితే కేసీఆర్ గవర్నర్ విందుకు డుమ్మా కొట్టడంపై అటు కేసీఆర్ కాని, సీఎంవో కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై ప్రస్తుతం రాజకీయ నేతల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు ఢిల్లీలో ఉండగా.. ఈ విందుకు హాజరుకాకపోగా, కేసీఆర్ హైదరాబాదులో ఉంటూనే గవర్నర్ విందుకు హాజరుకాకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 
 
ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలున్నప్పటికీ వాటిని పరిష్కరించే దిశగా ఇరు రాష్ట్రాల సీఎంలు సుముఖత వ్యక్తం చేయట్లేదని రాజకీయ పండితులు అంటున్నారు. ముఖ్యంగా కేసీఆరే ఇరు రాష్ట్రాల సమస్యల కంటే తెలంగాణ వరకే నియంత పోకడలో పోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ మాత్రమే తమ జాగీరా అంటూ.. ఏపీ ప్రజల్ని తిడుతూ.. వారి సమస్యలతో పనేంటి? అనే చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఉద్యమ నేతగా ఇలాంటి లక్షణాలు కలిగివుండటం సరిపోయేది కానీ.. తెలంగాణ సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తమ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటేనే తెలంగాణ అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. మరి కేసీఆర్-చంద్రబాబు ఏం చేస్తారో వేచి చూడాలి.