శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2015 (13:04 IST)

నగ్మాతో ఖుష్బూకు చెక్.. మారుతున్న తమిళ కాంగ్రెస్ పాలి'ట్రిక్స్'... 22న చెన్నైకు నగ్మా!

'ముల్లును ముల్లు'తోనే తీయాలన్న సామెతను తమిళ కాంగ్రెస్ పార్టీ నేతలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులోభాగంగా ఏఐసీసీ మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులైన నగ్మాతో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన ఖుష్బూకు చెక్ పెట్టించాలని ఓ వర్గం భావిస్తోంది. ఇందుకోసం ఖుష్బూ వ్యతిరేక వర్గం నేతలు చకచకా పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఈనెల 22వ తేదీన నగ్మాను చెన్నైకు ఆహ్వానించి ఆమెకు సత్కారం చేయాలని నిర్ణయించారు.
 
 
వాస్తవానికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నగ్మా గత 16వ తేదీన చెన్నై చేరుకున్నారు. ఆ రోజున ఆమె సత్యమూర్తి భవన్‌లో విలేకరులను కలుసుకోనున్నట్టు ముందుగానే ప్రకటించారు. అయితే ఆఖరి క్షణంలో ఆమె సత్యమూర్తి భవన్ కార్యక్రమాన్ని రద్దు అయింది. చెన్నై విమానాశ్రయంలో నగ్మా ఆహ్వాన కార్యక్రమంలోనూ కలకలం చెలరేగింది. మహిళా కాంగ్రెస్ ఆధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధారణి వర్గం నేతలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరుసటి రోజు తూత్తుకుడిలో జరిగిన కాంగ్రెస్ ప్రాంతీయ మహానాడులో నగ్మా పాల్గొనేందుకు ఆసక్తితో ఉండగా చివరి సమయంలో ఆ కార్యక్రమం కూడా రద్దయింది.
 
దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం టీఎన్‌సీసీ అధినేత ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులైన ఖుష్బూ అత్యంత సన్నిహితురాలు. అదేసమయంలో ఎమ్మెల్యే విజయధారణి అంతర్లీనంగా ఇళంగోవన్‌కు వ్యతిరేకం. పైగా టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి రేస్‌లో విజయధారణి ఉంది. ఇదే జరిగితే ఖుష్బూను బరిలోకి దించాలని ఇళంగోవన్ భావిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేలా విజయధారణి చక్రం తప్పి.. నగ్మాను దగ్గరయ్యారు. పైగా.. ఈమె అఖిల భారత మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులు కావడం విజయధారిణికి కలిసొచ్చిన అంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన నగ్మాను సత్యమూర్తి భవన్‌కు ఆహ్వానించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. దీనిపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయధారణి మాట్లాడుతూ గత 4వ తేదీ నుంచి పర్యటిస్తున్నానని, నగ్మా వచ్చిన రోజున చెన్నైలో లేనందున ఆహ్వానించడానికి వీలు కాలేదన్నారు. దీంతో నిర్వాహకులను పంపినట్లు తెలిపారు. 22 వ తేదీ విజయదశమి రోజున సత్యమూర్తి భవన్‌లో మహిళా కాంగ్రెస్ భవనం ప్రారంభోత్సవం జరగనుందని, ఈ కార్యక్రమానికి నగ్మా, కుష్బూలను ఆహ్వానించామన్నారు. కార్యక్రమంలో నెహ్రూ 125 వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన సంస్మరణ లేఖ విడుదల కార్యక్రమం జరుగనుందన్నారు. మొత్తంమీద తమిళ కాంగ్రెస్ రాజకీయాలు ఇద్దరు సినీ నటుల చుట్టూత తిరిగేలా కనిపిస్తున్నాయి.