శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: సోమవారం, 28 జులై 2014 (20:22 IST)

పెప్పర్ స్ప్రే ఘటనలో రాజగోపాల్ పై చర్యలుంటాయా?

రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ర్పే చేసి సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకూ ఏ సభ్యుడూ ప్రవర్తించరాని విధంగా చట్ట సభలో ప్రవర్తించి అందరి దృష్టిలోనూ పలుచనయ్యారు. పార్లమెంటు చర్రితలోనే కనీవినీ ఎరుగని ఘటన ఇది. దీనిపై తెలంగాణకు చెందిన మరో ఎంపీ పొన్నం ప్రభాకర్ ఢిల్లీలోని పార్లమెంటు వీధి పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇప్పుడా కేసు ఏమైంది? తన ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతోనే పెప్పర్ స్ప్రే చేయాల్సి వచ్చిందని రాజగోపాల్ తన చర్యను సమర్థించుకున్నారు.
 
పొన్నం ప్రభాకర్ పెట్టిన కేసు పార్లమెంటు పరిధిని దాటి భారత శిక్షాస్మృతికి చేరుతుందా అనే చర్చకూడా తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ సంఘటన పార్లమెంట్ వెలుపల జరిగివుంటే పోలీసులు వెంటనే న్యాయ విచారణ జరిపేవారు. కానీ, లలిత కుమారి వర్సెస్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేసులో కోర్టు తీర్పు చెప్పిన దాని ప్రకారం సీఆర్ పీసీలోని సెక్షన్ 144 (1) ప్రకారం పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలి. అయితే ఈ సంఘటన చట్ట సభలో జరిగింది కనుక కేసు నమోదు చేయాలా లేదా అన్న అంశంపై పోలీసులు న్యాయసలహాను కోరారు. దీనిపై ఇంతవరకూ ఎటువంటి సమాచారం లేదు.
 
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 (2) ప్రకారం సభ్యులు పార్లమెంటు చర్చలో ఏం మాట్లాడినా దానిపై ఎలాంటి కేసులు పెట్టరాదు. సభ్యులు స్వేచ్ఛగా చర్చలో పాల్గొనేందుకే ఈ రకమైన ప్రత్యేక హోదాను ఇచ్చారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్ 1963లో స్పష్టం చేశారు. పార్లమెంటులో మాట్లాడిన దానిపై ఎలాంటి కేసులు పెట్టరాదని సుప్రీం కోర్టు కూడా అనేక సార్లు స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి పరిమితులు కల్పించరాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇక్కడ ఏం మాట్లాడినా కేసులు పెట్టరాదని స్పష్టం చేసినపుడు ఏం చేసినా చెల్లుబాటవుతుందా లేదా అన్నదే ఇక్కడ కీలకాంశం.
 
వాస్తవానికి రాజగోపాల్ చేసినది నేరపూరిత చర్యేనని కొందరు వాదిస్తున్నారు. ఇదే బయట జరిగి ఉంటే కచ్చితంగా రాజగోపాల్ శిక్షార్హుడయ్యేవారని చెపుతున్నారు. కానీ, పార్లమెంటు సభ్యుడు గనుక అతనికి ప్రత్యేక హోదా వుంటుందని చెబుతున్నారు న్యాయ నిపుణులు. మరి రాజగోపాల్ పై కేసు వుండదా? కేవలం పార్లమెంటు మాత్రమే సభ్యునిపై చర్య తీసుకునే అధికారం కలిగివుంటుందా? అలా అనుకున్నా ప్రస్తుతం రాజగోపాల్ పార్లమెంట్ సభ్యుడు కాదు గనుక అలాంటి చర్యలు తీసుకునే అవకాశమే లేదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవడమే మేలనేది కొందరి వాదన.
 
జెఎంఎం ముడుపుల కేసులో కోర్టు చెప్పిన తీర్పును కూడా ఇక్కడ ఉదహరించుకోవచ్చు. లంచం తీసుకుని ఆరోపణలకు గురైన వారిపై ఎలాంటి క్రిమినల్ కేసు వుండదు. పార్లమెంటులో ఓటింగ్ వేయడంపై ఏ కోర్టూ ప్రశ్నించలేదు. కానీ, లంచం తీసుని అవినీతి ఆరోపణలకు గురైన వారు ఓటు వేయకపోతే మాత్రం వారిపై ఐపీసీ 120(ఎ) ప్రకారం క్రిమినల్ విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పార్లమెంటులో ఓటింగ్‌తో సంబంధం లేనపుడు లంచం తీసుకోవడం నేరం గనుక వారిని విచారించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. 
 
అయితే ఈ తీర్పుతో కొందరు న్యాయమూర్తులు విభేదించారు. రాజ్యాంగం నేరం చేసే స్వేచ్ఛను ఇవ్వలేదు గనుక నేరం ఎక్కడ చేసినా నేరమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాజగోపాల్ నేరపూరితమైన చర్యకు పాల్పడ్డారనీ, అది కూడా పార్లమెంట్ లోపల జరిగింది గనుక కేసుపెట్టాల్సిందేనని కొంతమంది వాదన. అయితే జరిగింది పార్లమెంట్ లో గనుక పార్లమెంట్ బయట వ్యవస్థలు విచారణ జరపలేవని మరికొంతమంది వాదిస్తున్నారు. ఈ అంశాన్ని న్యాయస్థానమే తేల్చాల్సి ఉంది.