శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (11:42 IST)

సోనియా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు... ఏపీని ముక్కలు చేసేటపుడు ప్రజాస్వామ్యం ఖూనీకాలేదా?

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలపై ఐదు పనిదినాలపాటు సస్పెన్షన్ వేటు వేయడంతోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆమె అరిచిగీపెడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బర్త్‌డే కేకులా కట్ చేసినపుడు ప్రజాస్వామ్యం ఖానీ అయిన సంగతి ఆమెకు గుర్తుకు రాలేదు కాబోలు. పార్లమెంట్ సాక్షిగా నాటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను సొంత పార్టీకి చెందిన ఉత్తరాది ఎంపీలతో తన్నించి.. లోక్‌సభ సమావేశ మందిరం తలుపులు మూయించి, లైవ్ టెలికాస్ట్ నిలిపివేసి... విభజన బిల్లుకు ఆమోదముద్ర వేసినపుడు ప్రజాస్వామ్యం ఖూనీకాలేదా? ఇపుడు సోనియా అండ్ కో చేస్తున్న డిమాండ్లకు ప్రధాని మోడీ సర్కారు తలొగ్గకుండా, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెండ్ వేటు వేసేసరికి ఆమెకు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అనే చర్చ రాజకీయ నేతల్లో జోరుగా సాగుతోంది.
 
 
కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయగానే... ఏదో జరిగిపోయినట్లు కాంగ్రెస్ నేతలంతా మూతికి నల్ల గుడ్డలు కట్టుకుని వీధుల్లో పడి ప్రదర్శనలు చేస్తున్నారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైననాటి నుంచి సభలో అడుగు ముందుకు పడకుండా ఆటంకాలు సృష్టిస్తోంది ఎవరు? ప్రజాసమస్యల్ని పట్టించుకోకుండా ప్రజాధనం వృధా అవుతున్నా మంకు పట్టుపట్టిందెవరు? ఇంత చిన్న విషయానికే చీకటిరోజులు, ప్రజాస్వామ్య హత్య అంటూ పెడబొబ్బలు పెట్డం అవసరమా? కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడమే చీకటి రోజులైతే.. ఎమర్జెన్సీని ఏమనాలో కాంగ్రెస్ నేతలు సమాధానం చెపుతారా? ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాచి... ఇదేమిటని ప్రశ్నించిన వారిని చీకటి గదుల్లో బంధించి చావ బాదిన రోజులను ఏమనాలి? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో... ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి నియంతృత్వ పాలన సాగించిందెవరు? నాటి కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలను, అరాచకాన్ని ఏమనాలో సోనియా గాంధే సెలవివ్వాలి. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో నాలుగున్నర కోట్ల మధ్య ప్రజానీకం వద్దంటున్నా.. మూడు నెలల పాటు లక్షలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ఓ నియంతలా ప్రవర్తించిన వారిని ఏ గాటనకట్టేయాలి? ఈ విభజన బిల్లుపై చర్చ జరిగేటప్పుడు.. విభజన వద్దన్నందుకు కాంగ్రెస్ పార్టీకే చెందిన 9 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసింది ఎవరు? నాటి ప్రధాని మన్మోహన్ నాయకత్వంలోని యూపీఏ సర్కారు కాదా? లోక్‌సభలోనే సొంతపార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను అదే పార్టీకి చెందిన సందీప్ దీక్షిత్ (ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ సుపుత్రుడు) వంటి ఉత్తరాది ఎంపీలతో కాళ్ళతో తన్నించలేదా? ఇంతకంటే ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుంటాయా.? విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు బంద్ చేసి.. లోక్‌సభ తలుపులేసి సభను కొనసాగించిన తీరు కంటే ప్రజాస్వామ్యానికి అవమానం ఏముంటుంది?
 
ఈ దారుణాలన్నీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీతో పాటు.. ఢిల్లీ వీధుల్లో వీరంగం వేస్తోన్న సోకాల్డ్ కాంగ్రెస్ నేతల కళ్ల ముందు జరిగినవే. అప్పుడు న్యాయంగా అనిపించింది ఇప్పుడు అన్యాయంగా అనిపిస్తోందా?. దేశంలో ప్రస్తుతం ఉన్న దుష్ట రాజకీయ దుష్ట సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? ఎన్నికల్లో చిత్తుగా ఓడినా కాంగ్రెస్ నేతలకు తత్వం బోధపడలేదా? సిగ్గు రాలేదు. కళ్లు తెరచుకోలేదు. ప్రజలు తమనెందుకు ఓడించారా అన్న ఆత్మవిమర్శ మచ్చుకైనా లేదు? ఎంపీలపై సస్పెన్షన్ వేటు సబబు కాదు. అందులో మరోమాట లేదు. కానీ పాపం చేయనివాడే రాయి విసరాలన్న నిబంధన పెడితే కాంగ్రెస్‌ నేతల్లో ఒక్కరంటే ఒక్కరికి ఆ రాయి విసిరే అర్హత ఉంటుందా? చీకటి రోజులు, ప్రజాస్వామ్యం ఖూనీ అనే పెద్ద పెద్ద మాటలు పక్కనబెట్టి... మీ ఆందోళనలు మీరు చేసుకుంటే మీకూ గౌరవం, ప్రజాస్వామ్యానికీ గౌరవం.