శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2015 (15:26 IST)

నారావారి చిన్నోడు... నిమ్మకూరు శ్రీమంతుడు.. ఎన్టీయార్ స్వగ్రామాన్ని దత్తతు తీసుకున్న లోకేష్

నారావారిపల్లె కుర్రాడు హైదరాబాద్ మీదుగా నిమ్మకూరు చేరాడు.. తన తాత స్వగ్రామైన నిమ్మకూరును దత్తతు తీసుకుని నందమూరి వారికి శ్రీమంతుడు అయ్యాడు. నందమూరి వంశాన్ని దశదిశల వ్యాపింపజేసిన నిమ్మకూరు దత్తతు తీసుకోవడానికి ఎన్టీయార్ వారసులు లేరా.. ఉన్నారు. డజన్ల కొద్ది ఉన్నారు. కానీ ఆ గ్రామానికి తాను శ్రీమంతుడనని నారా వారి చిన్నోడు ప్రకటించేశాడు. అయితే అదే సమయంలో తనకు స్వగ్రామమైన నారావారిపల్లెను ఆ ప్రేమ చూపలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. 
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం నారావారిపల్లె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పుట్టినూరు, స్వగ్రామం, బంధువులు, దాయాదులు, అక్కచెల్లెళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. 1978లో ఆయన రాజకీయ రంగప్రవేశం చేసిన నియోజకవర్గం కూడా ఇదే ఇక్కడ నుంచే ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. మంత్రి కూడా అయ్యారు. ఆ తరువాత ఆయన సోదరుడిని నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. ఆయనను కూడా ఎమ్మెల్యేను చేశారు. కానీ ఆ కుటుంబమే నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో కుప్పం నియోజకవర్గానికి రాజకీయ వలసపోగా... ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు చెన్నై నగరంలో కాపురముంటున్నాడు. రాజకీయ నాయకుడిగా పునాది వేసిన ఈ నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమి లేదనే విమర్శలు నేటికీ ఉన్నాయి. 
 
సంక్రాంతికి తమ గ్రామానికి వచ్చి విడిది చేయడం తప్ప నారా వారి కుటుంబం ఏనాడు ఈ ఊరి వైపు కూడా చూడరు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత స్వగ్రామాలను దత్తతు తీసుకోవాలని ఎన్నారైలకు, ప్రముఖులకు పిలుపునిస్తున్నారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు లోకేష్ బాబు కూడా పిలుపునిస్తున్నారు. మరి వారు మాత్రం తమ సొంత ఊరివైపునకు చూడడం లేదని పెదవి విరిచే వారూ ఉన్నారు. 
 
ఈ ఊరేమైనా పెద్దగా అభివృద్ధి చెందినా గ్రామామా..! అంటే అదీ లేదు. నాలుగు సిమెంటు రోడ్లు మినహా మరేమి లేవు. అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఊరి జనంతో నారా లోకేష్ బాబు కాస్త చనువుగా కనిపించారు. చంద్రబాబు కాకపోయినా తమ గ్రామాన్ని లోకేష్ ఆదుకుంటాడనే ఆశ గ్రామస్తుల్లో కనిపించింది. అయితే తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరును తాను దత్తతు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చంద్రగిరి నారావారిపల్లె చిన్నోడు నిమ్మకూరు శ్రీమంతుడయ్యాడు. ఆ గ్రామంలోని పర్యటించి ఎన్టీఆర్ దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
 
నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తన తల్లి భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న విషయాన్ని చెప్పారు లోకేష్‌. నిమ్మకూరు నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మహా మనిషి ఎన్టీయార్ ఆయన స్వగ్రామాన్ని దత్తతు తీసుకోవడానికి ఆయన వారసులు లేరా అంటే ఎందుకు లేరు.. డజన్ల కొద్ది ఉన్నారు. వారు ప్రస్తుతానికి మౌనం పాటించడంతో వారి స్థానాన్ని నారా లోకేష్ ఆక్రమించాడు.

ఇంత వరకూ బాగానే ఉంది. మరి ఇక్కడ తన స్వగ్రామమైన నారావారిపల్లె పరిస్థితి ఏమిటి.. తండ్రి వదిలేసి కుప్పం నియోజకవర్గానికి రాజకీయ వలస వెళ్ళితే... తనయుడు ఇలా నిమ్మకూరు చేరారానే ఆవేదన ఆ గ్రామస్తులలో కనిపిస్తోంది. కారణం రాజకీయ ఆశ్రయం కోసమేననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయినా చివరగా చంద్రబాబైన తన స్వంత గ్రామాన్ని దత్తతు తీసుకుంటారేమో వేచి చూడాల్సిందే.