శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 11 జనవరి 2016 (06:07 IST)

నరేంద్ర మోడీ ఓ నియంతనా... కేంద్ర మంత్రులంటే రబ్బరు స్టాంపులా?

ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఓ నియంతనా? తన కేబినెట్‌లోని మంత్రివర్గ సహచరులను రబ్బరుస్టాంపుల్లా చేసేశారా? వారిని కేవలం కేంద్రమంత్రి అనే పోస్టుకు మాత్రమే పరిమితం చేసి.. పవరంతా ఆయా శాఖ కార్యదర్శులకే అప్పగించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది పలువురు కేంద్ర మంత్రివర్యుల నుంచి. పైగా... తాము కేవలం రబ్బరుస్టాంపుల కన్నా దారుణంగా ఉన్నామంటూ తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు వినికిడి. 
 
నిజానికి కేంద్ర మంత్రి పదవి అంటే.. కిరీటం లేని రాజులు. సింహాసనం లేని చక్రవర్తులు. వారు తలచుకుంటే కాని పని జరగదు. కానీ అదంతా గతం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రులంటే.. కేవలం నిమిత్తమాత్రులు! కారణం.. వారి ప్రమేయం లేకుండానే పీఎంవో కనుసైగల ద్వారా.. కార్యదర్శుల చేతుల మీదుగా పనులు జరిగిపోతున్నాయి. సాక్షాత్తూ పలు శాఖల మంత్రులే 'నేనసలు కేంద్ర మంత్రినేనా' అనే సందేహాన్ని లేపుతున్నారంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రక్షణ, హోం శాఖ మంత్రుల స్థాయిలోనే ఈ పరిస్థితి ఉందంటే.. ఇక సహాయమంత్రుల సంగతి అడగనే అక్కర్లేదు. 
 
నిజానికి భారత రాష్ట్రపతిని రబ్బరు స్టాంపుగా పిలుస్తుంటారు. ఈయన కేవలం కేంద్ర మంత్రి మండలి సలహాసహకారాల ప్రకారం నడుచుకుంటారనే అపవాదు లేకపోలేదు. అందుకే రబ్బరుస్టాంపుగా పిలుస్తుంటారు. ఇపుడు ఆ పరిస్థితి తారుమారైంది. కేబినెట్‌లోని కేంద్రమంత్రుల పరిస్థితి రబ్బరు స్టాంపుల్లా మారిపోయారు. ఈ మాటలు సాక్షాత్తూ కేంద్ర మంత్రులే తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. 
 
ఉదాహరణకు కర్ణాటకకు చెందిన ఓ కేంద్రమంత్రి.. 'నేను అసలు కేంద్ర మంత్రినేనా అని ఒక్కోసారి నాకే అనుమానం వస్తోంది. కేవలం సంతకాలు పెట్టడానికే నేను పరిమితమయ్యా. ఎవరో తీసుకున్న నిర్ణయాలకు నేను జవాబుదారీ' అంటూ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తన శాఖకు చెందిన ప్రతి నిర్ణయాన్నీ తన సెక్రటరీనే తీసుకుంటున్నారని.. అడిగితే వివరణ ఇస్తున్నారని, లేకపోతే అదీ ఉండట్లేదని వాపోయినట్లు సమాచారం. 
 
అలాగే, పఠాన్‌కోట్‌ దాడి పట్ల కూడా రక్షణశాఖ, హోంశాఖ కార్యదర్శులు తమ తమ శాఖ మంత్రులకు పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికన్నా ముందే పిఎంవో (ప్రధానమంత్రి కార్యాలయానికి)కు సమాచారమిచ్చారని, కొన్ని కొన్ని విషయాలను మంత్రులకు చెప్పలేదన్న విమర్శలూ లేకపోలేదు. దాడులు జరిగిన మొదటి రోజు సాయంత్రం 5 గంటలకే పఠాన్‌కోట్‌ ఆపరేషన్‌ పూర్తి అయ్యిందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించడాన్ని బట్టి చూస్తుంటే ఆ శాఖల కార్యదర్శినుంచి ఏమేరకు ఆయనకు సహకారం అందుతోందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 
 
అలాగే, రక్షణశాఖ పట్ల కూడా మనోహర్‌ పారీకర్‌ కూడా సంతృప్తిగా లేరని, అందుకే ఆయన గోవాలో జరిగే కార్యక్రమాలకే పరిమితమవుతున్నారనే ప్రచారం బీజేపీలో జోరుగా సాగుతోంది. కేంద్ర రక్షణ సలహాదారు అజిత దోవల్‌ పూర్తిగా రక్షణశాఖను తన అధీనంలోకి తీసుకున్నారని, ప్రతి చిన్న విషయంలోనూ ఆయన జోక్యం ఎక్కువైందని, అందుకే మనోహర్‌ పర్రీకర్‌ అన్యమనస్కంగానే ఆ శాఖ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని రక్షణశాఖ అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే పరిస్థితి ప్రతి శాఖలోనూ కొనసాగుతున్నట్టు సమాచారం.