శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2015 (14:58 IST)

భూస్వామి మురళీ మోహన్ గారికే అంత బాధ కలిగితే... పవన్ పంచ్‌లు..

రాజధాని భూసేకరణ విషయంలో ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆపై.. ప్రసంగిస్తూ.. టీడీపీ మంత్రులు, టీడీపీ ఎంపీలను విమర్శించారు. ముఖ్యంగా ఎంపీ మురళీ మోహన్‌ను భూస్వామి అంటూ మండిపడ్డారు.

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా భూమిని కోల్పోయినప్పుడు మురళీ మోహన్ సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తూనే.. భూస్వామి ఆయనకే అంత బాధ కలిగితే.. ఎకరం, అరెకరం పొలాలున్న ఈ చిన్న రైతులకు ఇంకెంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరారు. 
 
మురళీ మోహన్‌కు భూములు బాగానే ఉన్నాయని పవన్ వ్యాఖ్యానించడం వెనక 'మా' ఎన్నికల స్టంట్ కూడా ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. 'మా' ఎన్నికల సందర్భంగా ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ 'మా' ఎన్నికల బరిలో దిగాక జయసుధను రంగంలోకి దించి అనవసరంగా 'మా' అధ్యక్ష ఎన్నికల్లో పాలిటిక్స్ చేసిన మురళీమోహన్‌పై పవన్ కల్యాణ్ ముందునుంచే గుర్రుగా ఉన్నారని.. అందుకే తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోయినా అన్నగారైనా నాగబాబును రాజేంద్రప్రసాద్‌కు మద్దతు ప్రకటించేలా చేసి ఎన్నికల్లో రాజేంద్రుడు గెలిపించేలా పవన్ చక్రం తిప్పారని రాజకీయ పండితులు అంటున్నారు. అందుకే సాకు చూసుకుని రైతుల భూముల్ని లాగేసుకుంటే రైతులు ఎలా బాధపడతారనే విషయాన్ని పవన్ విమర్శల ద్వారా ఇలా అన్నారంటున్నారు. 
 
మరో ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఇటీవల రాజధాని ప్రాంతాల్లో పర్యటించి రైతుల బాధలను తేలిగ్గా తీసుకున్నారన్నారు. ఆ ఇద్దరూ ఒక్కసారి కేపిటల్ గ్రామాల్లో పర్యటించి రైతుల గోడును ఆలకిస్తే మంచిదని పవన్ సూచించారు. ఇంకా మంత్రుల్ని కూడా పవన్ వదిలిపెట్టలేదు.

రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం కావాలని తాను ట్వీచ్ చేస్తే... యనమల, రావెల వంటి కొందరు మంత్రులు తాను అభివృద్ధికి ఆటంకమని విమర్శలు చేశారన్నారు. వారి తీరు బాధ కలిగించినా.. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ వంటి మేధావులతో ఒక కమిటీ వేసి చర్చించాలని పవన్ సూచించారు. లోపభూయిష్టంగా ఉన్న సీఆర్‌డీ‌ఏ చట్టాన్ని సవరించాలని కోరారు.