శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ESHWAR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (13:04 IST)

నరేంద్ర మోడీ కల నెరవేరేనా..? గంగానది పరవళ్లు తొక్కేనా...?

భగీరథుడు... పరమేశ్వరుణ్ని మెప్పించి... గంగమ్మను భువి నుంచి దివికి తీసుకొచ్చాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. కానీ ఇదంతా గత చరిత్ర. జీవనదిగా పేరుగాంచిన గంగానది అస్థిత్వం ప్రమాదంలో పడింది. కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. కోట్లాది ప్రజలకు జీవనాధారమైన గంగమ్మను ప్రక్షాళన చేస్తామంటోంది ఎన్డీయే సర్కారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిని పొందుపరిచింది. ఆరేళ్లలో గంగానదిని సమూలంగా ప్రక్షాళన చేసి... ప్రపంచ దేశాలు అసూయ పడేలా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెపుతోంది. నమామి గంగ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6300 కోట్లను కేటాయించింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి మోడీని అభినవ భగీరథుడంటూ ఆకాశానికెత్తేసింది. 
 
కేంద్రం విడుదల చేసిన నిధుల్లో రూ.2037 కోట్లు గంగానది ప్రక్షాళనకు, మరో రూ.4200 కోట్లు గంగా కారిడార్‌ అభివృద్ధికి, మిగతా రూ.100 కోట్లను గంగా ఘాట్‌లను ఆధునీకరించేందుకు ఖర్చు చేస్తారు. వీటంన్నింటినీ ఆరేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికితోడు గంగా ప్రక్షాళనకు నిధుల కొరతను తీర్చేందుకు ఎన్నారైల సాయం తీసుకోవాలని మోడీ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఎన్నారై గంగా ఫండ్‌‌ను ఏర్పాటు చేయనుంది. 
 
గంగానది ప్రక్షాళన ఈ నాటి ది కాదు..
గంగమ్మను కాలుష్య కోరల్లోంచి కాపాడాలన్న డిమాండ్‌ ఇవాళ కొత్తగా వచ్చిందేమీ కాదు. హిందువులు పవిత్రంగా భావించే గంగానదిని కాపాడాలంటూ పిఠాధిపతులు నిరశనలు చేస్తూనే ఉన్నారు. 2011లో నిగమానంద స్వామి, లేటెస్ట్‌గా కాశీ మహాసంస్థాన్‌ పీఠాధిపతి నాగ్‌నాథ్ యోగేశ్వర్‌లు దీక్షలు చేసి ప్రాణ త్యాగం చేయడం ఆందోళన కలిగించే అంశం. నదీ ప్రక్షాళనకు సర్కారు సంకల్పించినా... కార్యసాధనకు ఎన్నో అడ్డంకులు.. మరెన్నో అవాంతరాలు ఉన్నాయి. 
 
నదీ పరివాహ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిపాదనలపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గంగానదీ తీరం వెంట ఉన్న పవిత్ర క్షేత్రాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక వసతి, సదుపాయాలు, లైటింగ్‌, సౌండ్‌ షోలతో పాటు అత్యాధునిక హోటళ్లు నిర్మించాలని ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిపాదనలను నిపుణులు సున్నితంగా తిరస్కరించారు. పర్యావరణ పరంగా ఇవన్నీ పెను ప్రమాదాల్ని సృష్టించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. చార్‌ధామ్‌ వంటి ఘోర కలి పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. 
 
గంగమ్మతో ఆటలు కాదు
గంగమ్మ ప్రకోపిస్తే ఫలితం.. ఎలా ఉంటుందో చార్‌ధామ్‌ విపత్తు ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చాటింది. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిలు, డ్యాంలు గంగానదిపై కొత్తగా వెలిస్తే.... ఘోర కలి తప్పదని నిపుణులు అన్యాపదేశంగా చెబుతున్నారు. అడ్డగోలు నిర్మాణాలు, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డ్యాంలు గంగమ్మను ఊపిరి సలపనీయడం లేదు. స్వేచ్ఛగా... గలగలా పారే గంగమ్మ ప్రవాహం కుంచించుకుపోతోంది. అడుగడుగునా అడ్డంకులు.... దారిపొడవునా అక్రమ కట్టడాలతో గంగమ్మ బెంబేలెత్తుతోంది. ఏంచేయాలో తెలియక... ఉరకలై పారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. డ్యాంలు, బ్రిడ్జిలు గంగానది ప్రవాహాన్ని అడ్డుకుంటే.... పర్యాటక రంగం అభివృద్ధి మాటున... ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నిర్మాణాలు, పర్యాటకుల రద్దీ గంగ అస్తిత్వాన్ని సమూలంగా నాశనం చేసే ప్రమాదం పొంచి ఉంది. 
 
సంవత్సారానికి 40 వేల శవాలకు దహన సంస్కారాలు 
ఎన్డీయే సర్కారు భావిస్తున్నట్లు.. గంగా నదీ తీరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దితే... ప్రకృతి సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పర్యాటకం, రవాణా రంగం అభివృద్ధి చెందితే సందర్శకులు తాకిడి విపరీతంగా పెరిగిపోతుంది. వెరసి నదీ తీర ప్రాంతాల నుంచి ప్రతీరోజూ మూడు బిలియన్‌ లీటర్ల వ్యర్థజలాలు గంగానదిలో కలిసిపోతాయంటున్నారు విశ్లేషకులు. కేవలం వారణాసి పుణ్యక్షేత్రంలో ప్రతీరోజూ 400 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు గంగమ్మను కలుషితం చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
సంవత్సరం వ్యవధిలో కాశీ పుణ్యక్షేత్రంలో 40 వేల శవాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. ఈ ప్రక్రియలో 16 వేల టన్నుల వ్యర్థాలను నిర్ధాక్షిణ్యంగా గంగా నదిలో కలిపేశారని లెక్కలు చెబుతున్నాయి. గంగా తీర ప్రాంతాల్లో 700 టన్నుల కాలిన బూడిద, సగం కాలిన మనిషి ఎముకల్ని గుర్తించారు. ఇదే విషయాన్ని మోడీ సర్కారు దగ్గర ప్రస్తావిస్తే... ప్రజల మనోభావాల్ని, ఆచారాల్ని అడ్డుకోవడం తగదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. 
 
నది ఏదైనా కావచ్చు.. అది విసిరే పంజా దెబ్బ, విపత్తు తీవ్రత ఒకేలా ఉంటాయి. అది సబర్మతీ నది అయినా.. గంగా నది అయినా.. మరో నది అయినా కావచ్చు. మోడీ సర్కారు జపిస్తున్న గంగా ప్రక్షాళనపై లాభ నష్టాలను బేరీజు వేసుకుని... పర్యావరణం, ప్రకృతి సమతుల్యం దెబ్బతినకుండా చూడాలని పదే పదే హెచ్చరిస్తున్నారునిపుణులు.