శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: శనివారం, 12 జులై 2014 (17:04 IST)

పోలవరం ఎవరికి వరం? ఎవరికి శాపం?

పోలవరం ప్రాజెక్టుపై కీలక అడుగు పడింది. పోలవరం ముంపు మండలాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సు పార్లమెంటులో ఆమోదం పొందింది. అయితే పొరుగు రాష్ట్రాలను ఏమాత్రం సంప్రదించకుండా కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం జాతీయ సమగ్రతకు తూట్లు పొడవటమేనని తెలంగాణ ప్రాంత ఎంపీలు పోలవరం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. పోలవరంపై కేంద్రం అనుసరించిన వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలను పరిశీలిస్తోంది. 
 
పోలవరం బిల్లును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ పార్టీలు తెలంగాణవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే పోలవరం ప్రాజెక్టుపై ఇంత రగడ జరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాల్ని ఓ సారి పరిశీలిద్దాం.
 
పోలవరం ఓ సుదీర్ఘ ప్రయాణం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1941లో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఆలోచనకు బీజం పడింది. మద్రాసు ప్రెసిడెన్సీ చీఫ్‌ ఇంజనీర్‌ దివాన్‌ బహదూర్‌ ఎల్‌. వెంకట కృష్ణ అయ్యర్‌ ఈ ప్రాజెక్టుపై తొలి సర్వే నిర్వహించి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేశారు. ఆనాటి నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వివాదాల మధ్యే నలిగిపోతున్నది.
 
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో 1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టి. అంజయ్య పోలవరం ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన తెలంగాణకు చెందిన నాయకుడు. అప్పుడే పోలవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్‌ అని నామకరణం చేసింది కూడా అంజయ్యే. తరువాత 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావూ పోలవరం ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారు. నాటి నుంచి నేటి వరకూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు తమ పాలనలో ప్రతి ఏటా బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పెంచుతూ పోయారే తప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం చేపట్టలేకపోయారు.
 
వైఎఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించిన సమయంలో చేపట్టిన జలయజ్ఞం పనుల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దశాబ్దాల జాప్యం తర్వాత 2004 నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంది. ఇప్పటికే 5000 కోట్ల వ్యయంతో కాలువల నిర్మాణం కూడా పూర్తయింది
 
పోలవరం వివాదంగా ఎందుకు మారింది..? 
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ చర్చనియాంశంగా తయారై వివాదాలకు కేంద్రంగా మారింది. ఈ ప్రాజెక్టు సాగు ప్రయోజనాలు, విద్యుత్ ఉత్పత్తి, ముంపు సమస్యలు, ఇరుగుపొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఈ ప్రాజెక్టును చుట్టుముట్టాయి. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల వ్యవసాయం, విద్యుదుత్పత్తి, త్రాగునీరు, పారిశ్రామికాభివృద్ధే పోలవరం ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం. కానీ ఈ భారీ ప్రాజెక్టుకు నిపుణుల సిఫారసులను పెడచెవిన పెట్టిన అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నివేదికను 1970లో తయారుచేసి, మళ్ళీ దాని స్వరూపాన్ని 1978లో మార్చింది. 
 
ఈ నేపథ్యంలో ఒరిస్సాలోని మోటు, ఛత్తీస్‌గఢ్ లోని కొంటా తాలూకా లోని గిరిజన గ్రామాలు విపరీతమైన ముంపుకు గురయ్యే ప్రమాదమున్నందున బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఆ రాష్ట్రాలు షరతులు పెట్టాయి. పోలవరం ప్రాజెక్టుల వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వుంటుందని మొదటి అంచనా వేయగా, తర్వాత వెయ్యేళ్ళకు ఒకసారి వచ్చే గరిష్ట వరద ప్రవాహం యాభై లక్షల క్యూసెక్కులుగా లెక్కకట్టారు. ఈ యాభై లక్షల క్యూసెక్కులను పరిగణలోకి తీసుకొని ముంపును అంచనా వెయ్యాలని ఒడిస్సా అంటోంది.
 
ఈ ప్రాజెక్టు వల్ల ఒరిస్సా, చత్తీస్ ఘఢ్ లోని ముంపు సమస్య ఏర్పడడంతో కరకట్టల నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. 2005లో ఈ అంచనాలను అనుసరించి ముంపునకు గురయ్యే స్థలాలను, గ్రామాలను, అడవులను గుర్తించడమే కాకుండా దానికి తగ్గట్టు నిర్వాసితుల పునరావాస పథకాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతిని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిని పొందింది. అయితే పొరుగు రాష్ట్రాల్లో ముంపుకు గురవుతున్న ప్రాంతాల విషయమై ఆయా రాష్ట్రాలతో సంప్రదించి, అనుమతులు పొందకుండానే ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులు చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజనతో ఈ వివాదం మరోసారి రాజుకుని జాతీయ ప్రాజెక్టు హోదా దక్కించుకుంది పోలవరం.
 
పోలవరం ఓ  వరం .. 
గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో మొత్తం 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. వీటితోపాటు విశాఖ జిల్లాలో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మరో 23.44 టీఎమ్‌సిల నీటిని తరలించనున్నారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి అవుతుంది.  
 
పోలవరం నిర్మాణం పూర్తయితే మొత్తం 273.04 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్ళించవచ్చు. కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారెజీ ఎగువభాగంలో పోలవరం నీరు కలుస్తుంది. అంతేకాదు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇలా మళ్ళేంచే 80 టీఎంసీలలో 21 టీఎంసీలు కర్నాటకకూ, 14 టీఎంసీలు మహారాష్ట్రకు వెళతాయి.
 
ముంపు గ్రామాలే అసలు సమస్య 
పోలవరం నిర్మాణం వల్ల చాలా గ్రామాలు ముంపునకు గురవుతాయి. నిర్వాసితుల సంఖ్య కూడా భారీగానే వుంటుంది. రాష్ట్రంలోని 274 గ్రామాల్లోని 44,574 కుటుంబాలకు చెందిన 1,77,275 మంది నిర్వాసితులవుతారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలో 32 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 గ్రామాలు ప్రాజెక్టులో కలిసిపోతాయి. ఖమ్మం జిల్లాలో నిర్వాసితుల సంఖ్యలో సగానికి పైగా గిరిజనులే. అలాగే ఒడిశాలో 8 గ్రామాలకు చెందిన 6,316 మంది, చత్తీస్‌ఘడ్‌లో 4 గ్రామాలకు చెందిన 11,766 మంది నిర్వాసితులవుతారు. ఇంత భారీ సంఖ్యలో గ్రామాల తరలింపు, నిర్వాసితులకు పునరావాసం, ప్రాజెక్టు మొత్తం వ్యవహారంలో ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. 
 
పోలవరం ఇక జాతీయ ప్రాజెక్టు 
2010-11 ధరల ప్రకారం పోలవరం నిర్మాణం కోసం 10 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకూ సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయంలో తొంభై శాతం కేంద్రం భరిస్తుంది. తాజా ధరల ప్రకారం మరో ఇరవైశాతం నిర్మాణ వ్యయం పెరుగుతుందని అంచనా వేసుకుంటే 10 వేల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేయాల్సి వుంటుంది.  
 
పాపం పోలవరం వారికి శాపం 
ఖమ్మం జిల్లా ప్రజలు పూర్తిగా పోలవరం ప్రాజెక్టును వ్యతిరేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని గిరిజనుల తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 278 నుంచి 370 గ్రామాల వరకు మాయమవుతాయి. దాదాపు లక్ష ఎకరాల్లో పంట పొలాలు జల సమాధి అవుతాయి. భారీస్థాయిలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది.  ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనులకు మరో జీవన విధానం తెలియదు. అలాంటి అడవి బిడ్డలకు జీవన్మరణ సమస్య సృష్టించడం అమానవీయమంటూ ప్రజాసంఘాలు గత పది సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాయి. ఇక మా రాష్ట్ర ప్రజలను.. ప్రాంతాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా విలీనం చేస్తారంటూ తెలంగాణా వాదులు గగ్గోలు పెడుతున్నారు.
 
మొత్తానికి పోలవరం ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంత ప్రజానీకం ఆధునిక దేవాలయంగా అభివర్ణిస్తుంటే తెలంగాణా ప్రాంతానికి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గిరిజనుల పాలిట శాపంగానే తయారైంది. అయితే ఇటువంటి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన జరిగినప్పడు ఇటువంటి ఇబ్బందులు ఎదురవడం అతి సహజం. అయితే ప్రభుత్వాలు నిర్వాసితులకు తగు న్యాయం చేసే విధంగా.. వారి బతుకుకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి.