శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 17 నవంబరు 2014 (15:20 IST)

అన్నాడీఎంకె లోకి రజినీకాంత్...? భాజపాలోకి వెళితే...?

ఎట్టకేలకు 'తలైవా' అని పిలుచుకునే రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేటతెల్లం చేశారు. కాకపోతే ఆయన కొత్త పార్టీ పెడుతారా... లేదంటే అన్నాడీఎంకెలో జయలలిత పొలిటికల్ కెరీర్ ఎండ్ అయినట్లే అయ్యింది కనుక ఆ పార్టీలో చేరి పార్టీకి కొత్త ఊపిరిలూదుతారా... అలా కాదంటే మోడీ ఆశీస్సులతో భాజపా తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరపును ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగం లోకి దిగుతారా అనే చర్చ సాగుతోంది.
 
సినీ రంగాన్నుంచి వచ్చి ఎం.జి.ఆర్‌, కరుణానిధి, జయలలిత ఏళ్లపాటు తమిళనాడులో పాలన సాగించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మరో నటుడు వచ్చి రాజకీయాల్లో తనసత్తాను చాటుకుంటారని జనం అనుకుంటున్నారు. జయలలిత ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందనీ, దురదృష్టకర పరిణామాల వల్ల ఆమె పదేళ్ళు రాజకీయాల్లోకి రాకూడదనేది కోర్టు తీర్పు ప్రకారం జరిగిపోవడంతో ఇక ఆమె కెరియర్‌ ప్రశ్నార్థకంగా మారింది. 
 
తమిళనాడులో ఎప్పుడూ రెండు పార్టీలే ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం మామూలే. గతంలో జయలలిత కుంభకోణాలు, నియంతృత్వ ధోరణిని సహించలేక కరుణానిధికి పట్టం కట్టారు. మళ్ళీ కొన్నాళ్ళు ఆయన కుటుంబసభ్యుల అవినీతి.. అధికారం దుర్వినియోగంపై విసుగుచెంది మళ్ళీ జయలలితకు పట్టంకట్టారు. ఇతర చిన్నచిన్న పార్టీలతోపాటు బిజెపి వున్నా... ఒక్కసీటు కూడా దక్కించుకోకపోవడం విశేషం. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నరేంద్రమోడీ ఆశీస్సులు రజనీకాంత్‌కు వుంటాయని, ఎలాగూ అభిమానులు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారనీ, వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి.. రజినీ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందో లేదో...?