శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (14:26 IST)

ఇసుక కుంభకోణంలో తెదేపాపై వార్తలు... కేసీఆర్‌కు దగ్గరైన రామోజీ... అందుకే జగన్ కూడా...

పత్రికలు సమాజంలో కీలక పాత్రను పోషిస్తుంటాయి. ముఖ్యంగా ఈనాడు వంటి పెద్ద పత్రికపై ఓ పార్టీకి అనుకూల పత్రిక అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో ఆ పార్టీని జనంలోకి శక్తివంతంగా తీసుకెళ్లడంలో ఈనాడు కీలక పాత్ర పోషించిందనే వాదన కూడా ఉంది. అలాగే ఎన్టీఆర్ పదవీచ్యుతుడిన గావింపబడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన క్రమంలోనూ ఈనాడులో విశ్లేషణాత్మక కథనాలు వచ్చాయి. అవన్నీ చంద్రబాబుకు అనుకూలంగా సాగాయన్నది కొందరి వాదన. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఈనాడు ఉందనే చర్చ అప్పట్లో జరిగేది. 
 
ఐతే తెలుగు రాష్ట్రాలు విడిపోయాక పరిస్థితి మారిపోయింది. ఉద్యమ సమయంలో ఈనాడు సంస్థపై దుమ్మెత్తి పోసిన తెరాస చీఫ్ కేసీఆర్, ఆ తర్వాత మెల్లగా అందరూ తనకు కావాల్సినవారే అనడమే కాకుండా స్వయంగా రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లి గంటలకొద్దీ ఆయనతో సమావేశమయ్యారు. ఇక అక్కడి నుంచి రామోజీకి-కేసీఆర్‌తో మంచి సంబంధాలు నెలకొన్నాయి. రామోజీ ఫిలిమ్ సిటీ తెలంగాణ రాష్ట్రానికి ఓ ఎస్సెట్ అని తెరాస నాయకులు అనడం, రామోజీ పట్ల అక్కడి ప్రభుత్వానికున్న అభిప్రాయం చెప్పకనే చెప్పింది. ఐతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో ఇరికించేసింది. దానివల్ల తెలంగాణలో తెదేపాకు మచ్చ ఏర్పడినట్లయింది. ఫోన్ ట్యాపింగ్ వివాదం రాజుకుంది. 
 
మొత్తమ్మీద చంద్రబాబుకు-కేసీఆర్‌కు మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే చందంగా పరిస్థితి మారింది. ఇంకోవైపు రామోజీ-కేసీఆర్ సంబంధాలు పటిష్టమయ్యాయి. ఈ క్రమంలో ఈమధ్య ఇసుక కుంభకోణం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను విమర్శిస్తూ ఈనాడులో వార్తలు రావడం కూడా జరిగింది. ఇదంతా చూస్తుంటే రామోజీరావుకి - చంద్రబాబు నాయుడికి మధ్య గ్యాప్ పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాతావరణమే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, రామోజీ రావు సమావేశానికి ఊతమిచ్చిందని అంటున్నారు. మరి వీరి భేటీ భవిష్యత్ లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే.