శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (11:26 IST)

చంద్రబాబు చెప్పిందేమిటి..? స్మార్టు సిటీల ప్రకటనలో జరిగిందేమిటి..? అన్నీ ఒట్టి మాటలేనా..!

ప్రత్యేక హోదాలోనే కాదు... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్మార్ట్ సిటీల ప్రకటనలోనూ కేంద్రం షాకిచ్చింది. తాను ఒకటి అనుకుంటే కేంద్రం మరొకటి ప్రకటించింది. స్మార్ట్ సిటీలు, ప్రత్యేక ప్యాకేజీలతో జనంలో పలుకుబడి పెంచుకోవడానికి చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట బాబుగారి పప్పులు ఉడకలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు ఏం చెప్పారు. ప్రస్తుతం ఏం జరిగింది. వెంకయ్య నాయుడు ఎన్ని స్మార్ట్ సిటీలను ప్రకటించారు? 
 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పిన వాగ్ధానాలను ఒక్కసారి పరిశీలిద్దాం. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని చెప్పారు.  అంటే, జిల్లాకి ఒక స్మార్ట్‌ నగరం ఖచ్చితంగా రావాలన్నమాట. నూతన రాజధాని స్థల ఎంపిక'పై ప్రకటన చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 14 స్మార్ట్‌ నగరాలకు అదనంగా 3 మెగా సిటీలను నిర్మిస్తామనీ ఏపీ ప్రభుత్వం పేర్కొంది.  ఏడాది గడిచింది. ఇప్పటికి కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో మూడు నగరాల్ని 'స్మార్ట్‌ సిటీ' పథకాన్ని ప్రకటించింది. 
 
వెంకయ్య నాయుడు దేశ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన స్మార్ట్ సిటీలు ఎన్ని..? నాలుగు... వాటిలో విజయవాడ కూడా ఉంది. తిరుపతి,కాకినాడ, విశాఖపట్నంలు స్మార్ట్ సిటీలు ఎంపికయ్యాయి. అంటే చంద్రబాబు చేసిన ప్రకటన ఏమయ్యింది. ? ప్రతి జిల్లాలో స్మార్ట్ సిటీ అటకెక్కినట్లే.. ఇక మెగా సిటీలు రాష్ట్రంలో ఉంటాయో లేదో కూడా తెలియదు. అసెంబ్లీ సాక్షిగా 14 స్మార్ట్‌ సిటీలు, 3 మెగా సిటీలు.. అంటూ ప్రకటన చేసిన దరిమిలా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్కువలో తక్కువ అరడజను నగరాల పేర్లు అయినా కేంద్రానికి ప్రతిపాదించి వుండాల్సింది. విశాఖపట్నం.. అందరికీ తెల్సిన విషయమే.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరమిది. కాకినాడ ఎటూ కార్పొరేషన్‌. తిరుపతి ఆధ్మాత్మిక నగరం. ఈ మూడు నగరాలు స్మార్ట్‌గా అభివృద్ధి చెందడం ఆహ్వానించదగ్గ విషయమే. 
 
కానీ, అదే సమయంలో మిగతా 11 నగరాల ఊసే చంద్రబాబు ప్రభుత్వం కనీసం తెరపైకి తీసుకురాకపోవడం, మూడు మెగా సిటీల ఊసెత్తకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబుకు చెక్ పెట్టడానికి మాత్రమే కేంద్రం ఇలా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు కేంద్రానికి పంపే ప్రతిపాదనలలో చంద్రబాబే స్మార్ట్‌గా కోసేశారనే వాదన వినిపిస్తోంది. ఆయన ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరించేస్తానంటూ అధికార పీఠమెక్కిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల్ని నీరుగార్చారా.? ఎందుకు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.