శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 15 జులై 2015 (11:29 IST)

ప్రేమగా మాట్లాడటమే యువతుల నేరమా? : ప్రేమించకుంటే మూర్ఖంగా చంపేస్తారా?

నేటి యువతలో పైశాచికత్వం పెరిగిపోతోంది. కొంతమంది యువతులు స్నేహంగా మాట్లాడితే చాలు.. తనను ప్రేమిస్తోందనే భావనకు వచ్చేస్తున్నారు. ఆతర్వాత అపుడు చనువుగా మాట్లాడింది.. ఇప్పుడు ఎందుకు మాట్లాడదు... ఆమె నా సొంతం.. నాకు దక్కకపోతే మరెవ్వరికీ దక్కకూడదన్న మూర్ఖత్వంతో పెట్రేగిపోతున్నారు. ఫలితంగా అనేకమంది యువకులు శాడిస్ట్‌లు, ఉన్మాదులుగా మారిపోతున్నారు. 
 
స్నేహంగా మాట్లాడిన యువతి ఆ తర్వాత ప్రేమించడంలేదనే అక్కసుతో యువతులను దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతుండటం తీవ్రఆందోళనకు గురిచేస్తోంది. ప్రేమోన్మాదులు ఏకంగా యువతుల ఇళ్లలోకి చొరబడి కత్తులతో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 
 
తద్వారా వన్‌సైడ్ ప్రేమతో యువతులను బలిపీఠమెక్కిస్తున్నారు. దీంతో ఇరుగుపొరుగున ఉండే యువకులతో ఆడపిల్ల మాట్లాడలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని మోహన్ నగరంలో అక్కాచెల్లెళ్లు ప్రేమోన్మాది చేతిలో దారుణహత్యకు గురైన ఘటనతో ఉన్మాదుల చేష్టలు మరోసారి బయటపడ్డాయి. 
 
యువకులు ఉన్మాదులుగా మారిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యువకుల జీవనవిధానం ఓ కారణంగా ఉండగా, తల్లిదండ్రుల పర్యవేక్షణాలోపం మరో కారణంగా చెపుతున్నారు. అలాగే, పెద్దల మాటలను లెక్కచేయకుండా చదువులు పక్కనపెట్టి జులాయిగా తిరగడం, మనస్సును నిగ్రహించుకోలేకపోవడం, కోర్కెలు అదుపులో పెట్టుకోలేకపోవడం, జల్సాల పేరుతో మద్యంసేవించడం వంటి చెడువ్యసనాలు యువకులను ఉన్మాదులుగా మార్చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.