శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (22:11 IST)

పెద్దలకు పదవీ గండం..? ఎవరెవరికి.. ! ఎప్పుడు?

ప్రస్తుతం వారంతా మంత్రులు మరి కొన్ని నెలలు గడిస్తే.. మంత్రులుగా ఉంటారో లేదో తెలియదు. వివిధ పార్టీలలో వారు ముఖ్యనేతలు పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎన్నికవుతారో లేదో తెలియదు. ఇలాంటి స్థితి ఏ ఒక్క పార్టీకో సొంతం కాదు. అన్ని పార్టీలలోని సీనియర్లు అదే స్థితిని ఎదుర్కొంటున్నారు. వారు మంత్రులుగా ఉంటారో లేదో తెలియదు. ఇందులో ప్రధానికి దగ్గరగా ఉన్న మంత్రులు వెంకయ్య నాయుడు నిర్మలా సీతారామన్, చంద్రబాబు చాలా దగ్గరగా ఉన్న సుజనా చౌదరి వంటి వారు ఉన్నారు. ఇక రాహూల్‌కు దగ్గరగా ఉన్న విహెచ్ కూడా ఇదే తరహా రాజకీయ గండాన్ని ఎదుర్కొంటున్నారు.
 
పలు పార్టీలలోని వీరు అందరూ కీలక నేతలే కావడం విశేషం. అందరూ పెద్దల సభకు ఎన్నికైన వారే. వారిలో మంత్రి వెంకయ్యనాయుడు ప్రముఖుడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఈసారి రెన్యువల్ కష్టమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రూల్ బుక్ ప్రకారం ఒక నేత రెండుసార్లు మాత్రమే పెద్దల సభకు పంపే అవకాశముందట. కాకపోతే ఈయనకు త్రీ టైమ్స్ ఛాన్స్ ఇచ్చారట. దీంతో నాలుగోసారి రెన్యువల్ కావడం కష్టమేనన్న వాదన ఉంది. ఆయన్ని వేరే రాష్ర్టానికి గవర్నర్ లేదా ఉపరాష్ర్టపతి పదవి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అనూహ్య మార్పులేమైనా జరిగితే తప్ప ఆయన తిరిగి రాజ్యసభకు ఎన్నిక కావడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
ఇక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమె మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి మరణంతో ఆ సీటు నుంచి టీడీపీ- బీజేపీ కూటమి తరపున ఆమె ఎన్నికయ్యారు. ఈమె పదవీకాలం కూడా వచ్చేఏడాదితో ముగియనుంది. కాకపోతే ప్రధాని మోదీ టీమ్‌లో కీలకవ్యక్తి కావడంతో మరోసారి సీతారామన్ రాజ్యసభకు ఎన్నిక కావచ్చుననేది సమాచారం. అయితే పూర్తిగా మిత్రధర్మంపై ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం, బీజేపీ సంబంధాలు దెబ్బతింటే ఆమె ఇక్కడ నుంచి ఎన్నిక కావడం కష్టమే. వేరే రాష్ర్టం నుంచి రాజ్యసభకు వెళ్తారా అన్నది ప్రశ్న. 
 
ఇక మరో కేంద్ర సహాయమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనాచౌదరి. ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. ఆయన  పదవీకాలం కూడా వచ్చేఏడాదితో పూర్తికానుంది. చంద్రబాబుకు ముఖ్యుడైనా సరే ఆయనపై ఆర్థిక ఆరోపణలు వెల్లువెత్తడం, ఈ విషయం ప్రధాని మోదీ వద్దకు వెళ్లడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుజనాకు మరోసారి రెన్యువల్ కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ఆయన స్థానంలో ఆర్థికమంత్రి యనమల సైతం ఈసారి ఢిల్లీలో అడుగుపెట్టాలని తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఇక కాంగ్రెస్ విషయానికిస్తే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్, గాంధీ కుటుంబానికి వీర విధేయుడు వి. హనుమంతరావు. రాజీవ్‌తో‌వున్న పరిచయం కారణంగా సోనియా వద్ద మరోసారి రెన్యువల్ ఛాన్స్ కొట్టేశారు. యువ నాయకులను ఎంకరేజ్ చేసే రాహుల్, ఈసారి వీహెచ్‌ని కొనసాగిస్తారా అనేది అనుమానం. ఇలా రెండు రాష్ట్రాలలోనూ ముఖ్యనేతలకు పదవీ గండం తప్పదేమోననిపిస్తోంది.