శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (12:53 IST)

నాకొద్దు బాబోయ్‌.. ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటా... శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనే ఉన్న ముక్కంటి క్షేత్రాల్లో చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఒకటి. వాయులింగక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు ఎంతో ప్రాశస్త్యం చెందింది. దేశం నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి వస్తుంటారు. శ్రీకాళహస్తి ఆలయం ఎంత ప్రాముఖ్యమైనదో.. ఆ నియోజకవర్గం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా శ్రీకాళహస్తి వార్తల్లో ఉంటుంది. కారణం ఎవరో ఒక వీఐపీ ఆలయానికి వస్తూ పోతూ ఉండడమే. తిరుమలకు వచ్చే 50శాతంకుపైగా వీఐపీపిలు శ్రీకాళహస్తి క్షేత్రానికి వస్తుంటారు. రాజకీయంగా పలుకుబడి ఉంటేనే ఇక్కడ ప్రజాప్రతినిధి కావడానికి దోహదపడుతుంది. లేకుంటే ఇక తెలిసిందేగా... అలాంటి శ్రీకాళహస్తికి ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ నేత ఎస్సీవీనాయుడు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు ఎస్సీవీ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారంటే...
 
తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్‌కు శిష్యుడు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు. ఆయన ప్రోద్బలంతోనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సీటును సంపాదించి కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. అదెలాగంటారా.. అంతా సర్వేశ్వరుడి దయ. ముక్కంటి క్షేత్రానికి వచ్చే వీఐపీలకు దగ్గరుండి దర్శనాలు చేయించి అందరికీ చేరువయ్యారాయన. అలా ఎస్సీవినాయుడంటే అందరికీ సుపరిచితుడే..
 
అలా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నాయుడు అప్పట్లో ఒక వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులే కరువవ్వడం, ఘోరంగా నిలిచిన వారు ఓడిపోవడం ఇలా జరిగిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని రోజుల  పాటు సైలెంట్‌గా ఉన్న ఎస్సీవీనాయుడు మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడి చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ గాలిముద్దుక్రిష్ణమనాయుడు సహకారంతో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు బాగానే ఉన్నా స్థానిక నేతల నుంచి ఎస్సీవీకి చేదు అనుభవమే ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఎస్సివినాయుడు తెదేపాలోకి రావడం కొంతమంది నేతలను జీర్ణించుకోలేకుండా చేసింది.
 
ఏ కార్యక్రమానికి ఎస్సీవీ వెళ్ళినా ఆయనకు తప్ప మిగిలిన అందరికీ టీడీపీ నేతలు మర్యాద ఇస్తున్నారు. ఇది కాస్త ఎస్సివినాయుడుకు ఏ మాత్రం నచ్చలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రస్తుతం అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మొత్తం హవా అంతా బొజ్జల అనుచరులదే. ఇక ఎస్సీవీని పట్టించుకునేవారేరి. ఇలా ఎస్సీవీనాయుడు తెదేపాలో కనీస మర్యాద లేక ఇబ్బందులు పడుతున్నారు. తెదేపాకు రాజీనామా చేయకుండా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా ఇప్పటికే ఎస్సీవీనాయుడు సిద్ధపడ్డారట.
 
తన అనుచరులను పిలిచి ఒక సమావేశం పెట్టుకున్న ఎస్సీవీ రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పడంతో ఒక్కరంటే ఒక్క అనుచరుడు కూడా వెళ్ళొద్దని ఆపలేదట. ఎందుకంటే కనీసం ఎస్సీవీ అనుచరులు కూడా అదే పరిస్థితి పార్టీలో ఎదుర్కొంటుండడమే. మొత్తం మీద ఎస్సీవీ రాజకీయ సన్యాసం దాదాపు ఖరారైంది.