శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (14:14 IST)

శ్రీకాళహస్తిలో వార్‌ రూమ్‌... ఆ బోర్డు వెనుక పెద్ద కథేవుంది

ఏదైనా జఠిలమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు దానికి పరిష్కారం కనుగొనడం కోసం ఉన్నతస్థాయి నాయకులంతా సమావేశమై చర్చోపచర్చలు జరుపుతారు. చివరగా పరిష్కారంతో గది నుంచి బయటకు వస్తారు.

ఏదైనా జఠిలమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు దానికి పరిష్కారం కనుగొనడం కోసం ఉన్నతస్థాయి నాయకులంతా సమావేశమై చర్చోపచర్చలు జరుపుతారు. చివరగా పరిష్కారంతో గది నుంచి బయటకు వస్తారు. ఇలంటి సమావేశాలు నిర్వహించేందుకు శాశ్వతంగా సమావేశ మందిరాలు ఉంటాయి. దీన్నే వార్‌ రూమ్‌ అంటారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ వార్‌ రూమ్‌ ఉంది. ఇది ధర్మకర్తల మండలి సభ్యులకు మాత్రమే. అయితే ఇది పరిష్కారాలు వెతికేదిగా కాదు.. సమస్యలు సృష్టించేందుకు వేదికగా ఉంటోంది. బోర్డు సభ్యులు ఒకరితో ఒకరు తలపడేందుకు వేదికగా ఉంటోంది.
 
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధర్మకర్తల మండలి సభ్యుల కోసం ప్రత్యేక ఛాంబర్‌లో ఏసీలు, సౌకర్యవంతమైన కుర్చీలు ఏర్పాటు చేసేవారు. ఛైర్మన్‌ కార్యాలయానికి ఆనుకుని ఉండే ఈ ఛాంబర్‌లో ఎసీలు, సౌకర్యవంతమైన కుర్చీలు ఏర్పాటుచేశారు. బోర్డు సభ్యులు ఆలయానికి వచ్చినప్పుడు ఇందులో కూర్చోవచ్చు. ఒక విధంగా బోర్డు సభ్యుల ఉమ్మడి కార్యాలయ మన్నమాట. బోర్డు సభ్యులకు ఇలాంటి కార్యాలయం ఉండటం అవసరం కూడా. అది కూడా వాళ్ళ గౌరవం కోసం మాత్రమే ఏర్పాటు చేసినది కాదు. భక్తుల కోసం ఏర్పాటు చేసినది కూడా. ఆలయానికి వచ్చిన భక్తులకు ఏదైనా సమస్య వస్తే నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారులను కలుస్తారు. ఒక్కోసారి ఛైర్మన్‌ను, బోర్డు సభ్యులనూ కలుస్తుంటారు.
 
భక్తులు, ఉద్యోగుల సమస్యలపై బోర్డు సభ్యులనూ కల్పించుకుని పరిష్కరించమని సందర్భాలు అనేకం ఉన్నాయి. బోర్డు సభ్యుల ఛాంబర్‌ కూడా భక్తులకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో గతవారం రోజులుగా ఛాంబర్‌ బయట ఇతరులకు అనుమతి లేదు అనే బోర్డు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఇలాంటి బోర్డు కనిపించదు. అందుకే ఆశ్చర్యంగా ఆరాతీస్తే బోర్డు వెనుక కథ బయటకు వచ్చింది.
 
10 రోజుల క్రితం ఇదే ఛాంబర్‌లో ఇద్దరు బోర్డు సభ్యులు, ఒక తాత్కాలిక ఉద్యోగి నియామక విషయమై చర్చకు వచ్చి వాదోపవాదాలు చేసుకున్నారట. సై అంటే సై అంటూ గొడవకు దిగారట. అక్కడ రచ్చరచ్చగా మారిన వ్యవహారం సహజంగానే మీడియాకు తెలిసింది. గొడవ జరుగుతుండగానే ఆ సంగతిని ఎవరో వాట్సాప్‌లో పెట్టేశారు. ఈ ఉదంతం తర్వాత ఛాంబర్‌ బయట ఇతరులు లోనికి ప్రవేశించకూడదు అని బోర్డులు కనిపించాయి. దీనిపైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గొడవ జరిగిన సమయంలో ఒక విలేకరి అక్కడే ఉండటం వల్లే విషయం బయటకు పొక్కిందని భావించారు.
 
ఆ విలేకరిని లోపలికి రానివ్వకుండా చేస్తే లోపల ఎన్ని గొడవలు పడినా బయటకు రావనుకున్నారో ఏమో.. ఇతరులు ఎవరూ లోనికి రాకూడదని బోర్డులు పెట్టారు. కార్యాలయంలో గొడవ పడటంపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది పోయి దాన్ని కప్పిపుచ్చుకోవాడినికి మార్గాలను అన్వేషించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరు అవునన్నా, కాదన్నా బోర్డు సభ్యుల మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలో అనేక అంశాలపై ఒకరితో ఒకరు విభేదిస్తుంటారు. ఈ ఛాంబర్‌లో తరచూ గట్టిగట్టిగా వాదించుకుంటుంటారు. ప్రజాస్వామ్యంలో విభేదించే స్వేచ్ఛ ఉంది. దాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. అయితే అది ఘర్షణకు దారి తీయకూడదు. అందులోనూ పవిత్రమైన ఆలయంలో దూషణలకు, ఘర్షణలకు అసలు చోటుండకూడదు. ఈ ప్రాథమికమైన విషయాన్ని మరిచిపోయి, ధర్మకర్తల మండలి సభ్యులే గొడవపడటం భక్తులకు ఆవేదన కలిగిస్తోంది. తప్పును సమర్థించుకునేందుకు మరో తప్పు చేసినట్లు ఇతరులకు అనుమతి లేదంటూ బోర్డు పెట్టారు.
 
బోర్డు సభ్యుల ఛాంబర్‌లోకి ఇతరులు ఎవరూ ప్రవేశించకూడదని చెప్పడం సరైనదేనా? అది ఛైర్మన్‌ కార్యాలయమైనా, ఈఓ ఛాంబరైనా సరే భక్తులు వెళ్ళడానికి అవకాశముంది. అలాంటిది బోర్డు సభ్యుల ఛాంబర్‌లోకి ఎందుకు ప్రవేశించకూడదో తెలియదు. ఈ బోర్డు సభ్యులే ఒక పంచాయతీ కార్యాలయానికో, మండల పరిషత్‌ కార్యాలయానికో వెళతారు. అక్కడ సభ్యుల ఛాంబర్‌లోకి అనుమతించకుంటే అంగీకరిస్తారు. ఇదీఅంతే. అంతెందుకు అధికార పార్టీ నాయకులే ఆలయానికి వచ్చినప్పుడు బోర్డు సభ్యులను కలవడానికి ఛాంబర్‌కు వస్తారు. వారిని మీరు లోనికి రాకూడదని బోర్డు సభ్యులో, అధికారులో చెప్పగలరా? ఛాంబర్‌ కేటాయించిందే తమ కోసం వచ్చిన వారికి కూర్చోబెట్టి మాట్లాడడానికి ఆ విషయం మరిచిపోకూడదు. 
 
మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ ఆదేశాలతోనే ఛాంబర్‌కు బోర్డు పెట్టారని ప్రసారం జరుగుతోంది. ఆలయ కార్యాలయానికి సంబంధించి ఆమె అలాంటి సలహా ఇస్తారని అనుకోలేం. ఏమైనా దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది అప్రజాస్వామిక చర్య. ఇప్పటికే ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ ఇంటెలిజెన్స్ నివేదికల రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతున్నాయి. ఇలాంటివన్నీ ధర్మకర్తల మండలికి మరకలే అవుతాయి. శివయ్య ఆలయ పాలకమండలిలో పనిచేయాలని వందమంది నిరీక్షిస్తుండగా ఆ అవకాశం లభించిన వారు నిజంగా అదృష్టవంతులే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయ ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాలి. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నించాలి. ముక్కంటి సంపదను, ఆస్తులను పరిరక్షించాలి. అంతేకానీ అనవసర వివాదాలతో కాలం వెళ్ళదీయకూడదు.