శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 11 ఫిబ్రవరి 2016 (16:15 IST)

అక్కడ తెదేపా ఇక్కడ వైకాపా మటాష్ అవుతాయా...?

ఒక రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మనుగడ చాలా చాలా కష్టమని గతంలో ఎన్నో రాష్ట్రాలు చెప్పకనే చెప్పాయి. భావోద్వేగంలో కొన్ని పార్టీలు పుట్టినా ఆ తర్వాత రాజకీయ ఆటుపోట్ల మధ్య అధికారం ఆమడదూరమైతే ఆ పార్టీని నడపడం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఇది పెద్ద సవాల్. తెలుగుదేశం పార్టీ కేంద్రంతో పొత్తు పెట్టుకుని ఉండటం వల్ల రాష్ట్ర విభజన జరిగినా ఏలాగో నెట్టుకొస్తోంది. 
 
ఇక విభజన జరిగిన తర్వాత ధనిక రాష్ట్రంగా మారిపోయిన తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న తెరాస, వరుస విజయాలతో విపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ముఖ్యంగా అక్కడ మొదట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునాది వేయాలని చూసినా ఫలించలేదు. వైఎస్ జగన్ సోదరి షర్మల ప్రచారం చేశారు కానీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే సాహసం చేయలేదు. ఐతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తనేనంటూ గ్రేటర్ ఎన్నికల సమయంలో చేసిన పర్యటన ఫలితాలను రాబట్టలేకపోయింది. 
 
హైదరాబాద్ నగరంలో పట్టుమని 10 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. దీనితో సహజంగానే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. ఇక ఆలస్యం చేస్తే పరిస్థితి ఎలా మారుతుందోనని ఏకంగా టి.తెదేపా శాసనసభా పక్షం నాయకుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి మరో ఎమ్మెల్యేను తీసుకుని తెరాసలో చేరిపోయారు. మిగిలినవారు కూడా ఏదో రోజు తెదేపాను వీడక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో తెదేపా బతకది అని వ్యాఖ్యానించారు కూడా. ఆ రకంగా తెరాసలోకి తెదేపా నుంచి 9 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పుట్టిన తెదేపాకు అలా తెలంగాణలో దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కొందరైతే తెలంగాణలో తెదేపా ఇక కనుమరుగు కాక తప్పదని అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికలు సవాల్ లాంటివే. ఆ ఎన్నికల్లో వైకాపా ఏపీలో అధికార పీఠాన్ని చేజిక్కించుకోకపోతే ఇబ్బందులు తప్పవనీ, తెలంగాణలో తెదేపాకు ఎదురవుతున్న పరిస్థితులో వస్తాయని అంటున్నారు. చూడాలి వచ్చే 2019 సంవత్సరంలో ఆయా పార్టీల భవిష్యత్తు ఏమిటో...?!!