శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శనివారం, 27 డిశెంబరు 2014 (15:50 IST)

2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: అమర వీరులకు జోహార్ జోహార్!!

2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. ఈ ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అనుకూలించాయి. ఫలితమే.. 2014, జనవరి 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
 
2014, ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2014, ఫిబ్రవరి 18: లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. 2014, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
 
2014, మార్చి 1: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. 2014, మార్చి 4: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ. జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2014, జూన్ 2: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. 
 
ఇలా తెలంగాణ అమరుల త్యాగాలు ఫలించిన ఈ 2014 ఏడాదికి తెలంగాణ బిడ్డలంతా ఘనమైన వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తమ రాష్ట్రాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామని నడుం బిగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఆ పార్టీ నాయకుడు కె. చంద్రశేఖర రావు సీఎంగా ప్రమాణం స్వీకరించారు. జూన్ నుంచి పరిపాలన ప్రారంభించారు. ఈ ఏడాది చివరి వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో తలమునకలయ్యారు.
 
రైతు రుణమాఫీ వంటి ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పాలక పార్టీగా, టీడీపీ ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. టీడీపీ నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా., ఆ పార్టీలో నుంచి టీఆర్ఎస్‌లోకి వస్తున్న వలసలను కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. తద్వారా టీఆర్ఎస్‌ను తెలంగాణలో మరింత బలోపేతం చేస్తూనే.. అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు. హైదరాబాద్ నగరంలో మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఆడబిడ్డల రక్షణార్థం షి టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ శాఖను కుమారుడు కేటీఆర్‌కే అప్పగించారు. 
 
ఎంపీగా కూతురు కవితను ఢిల్లీకి పంపారు. ఇక అల్లుడు హరీష్ రావును పక్కన్నే పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కుంటూనే అభివృద్ధి చర్యలు చేసుకుంటున్నారు. ఐతే తెలంగాణ జేఏసీ కేసీఆర్ సర్కారు అభివృద్ధి కార్యక్రమాలపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన జేఏసి రాబోయే 2015 సంవత్సరం నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.