శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ESHWAR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (12:08 IST)

అసెంబ్లీ రచ్చ : తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్!

విభజన జరిగి రెణ్నెల్లు కావొస్తున్నా... అసెంబ్లీ పంపకాలు మాత్రం తెగడం లేదు. భవనాల సర్దుబాటుపై రెండు రాష్ట్రాలు వెనక్కి తగ్గట్లేదు. వివాదాన్ని పరిష్కరించేందుకు గవర్నర్ ప్రయత్నించినా... ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి నీటిపంపకాలు, ఎంసెట్ కౌన్సెలింగ్‌పై గొడవ పడుతున్న రెండు రాష్ట్రాల మధ్య... అసెంబ్లీ విభజన మరింత దూరం పెంచేలా కనిపిస్తోంది.
 
గతంలో ఇచ్చిన ఆదేశాల్ని పాటించేందుకు తెలంగాణ సర్కార్ ససేమిరా అంటుంటే... అవే నిబంధనల్ని పాటించాలంటోంది ఏపీ ప్రభుత్వం. దీనికితోడు రెండు రాష్ట్రాల స్పీకర్లు తమకు అవసరమైన కార్యాలయాల్ని కేటాయించుకుంటూ సర్క్యులర్ ఇవ్వడంతో సమస్య మరింత జఠిలమైంది. అసెంబ్లీ వివాదంపై రెండు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శుల్ని పిలిచి మాట్లాడారు గవర్నర్ నరసింహన్. రూల్స్ ప్రకారం తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డికి ఇచ్చిన గదుల్ని వదిలేసి... మిగిలిన వాటిని ఖాళీ చేయాలని సూచించారు. అయితే గవర్నర్ సూచనకు టీ సర్కార్ ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దగ్గర పడటంతో... ఏం చేయాలా అని అధికారులు తల పట్టుకుంటున్నారు. 
 
విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని భవనాలను కేటాయించారు గవర్నర్. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తోంది. సమావేశాలకు వీలుగా ఉందన్న ఒక్క కారణంతో... మిగిలిన సమస్యల్ని పట్టించుకోకుండా పాత అసెంబ్లీ భవనాన్ని ఏపీకి కేటాయించారని మండిపడుతోంది. అసెంబ్లీ వరకు ఇబ్బంది లేకున్నా... ఒక రాష్ట్రానికి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్, విప్‌లు, ప్రతిపక్ష నేత, పార్టీల శాసనసభాపక్ష కార్యాలయాలతో పాటు... అసెంబ్లీ, మండలికి అనుబంధంగా ఉండే 40 సెక్షన్ల సిబ్బందికి ఎక్కడ వసతి కల్పిస్తారని ప్రశ్నిస్తోంది. 
 
ఇవికాక 18 అసెంబ్లీ కమిటీల ఛైర్మన్లకు గదులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రస్తుతం అన్ని రూమ్‌లు లేవు. పైగా రెండు అసెంబ్లీలు ఒకే ప్రాంగణంలో ఉంటే... రాజకీయ ఇబ్బందులొస్తాయని తెలిసినా విభజన కమిటీ పట్టించుకోలేదని తెలంగాణ సర్కార్ విమర్శిస్తోంది. మరోవైపు గతంలో ఇచ్చిన ఆదేశాల్నే అమలు చేయాలంటూ...  గవర్నర్‌ను కలిశారు కోడెల, చక్రపాణి.పబ్లిక్‌గార్డెన్స్‌లోని ప్రియదర్శిని ఆడిటోరియాన్ని ఏపీకి కేటాయించాలన్న ప్రతిపాదన వచ్చినా... భద్రతా కారణాలతో పోలీసులు తిరస్కరించారు. మొత్తానికి అసెంబ్లీ విభజనపై రెండు రాష్ట్రాలు పట్టు వీడటం లేదు.