శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: బుధవారం, 29 జూన్ 2016 (12:02 IST)

పద్మావతి ఆలయంలో "కలెక్షన్‌ కింగ్‌"లు... కళ్లు మూసుకుని నోట్లు వేసేస్తున్నారు...

అదేంటి.. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కదా... పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏంటి అనుకుంటున్నారా... తితిదే సిబ్బందే ఇక్కడ కలెక్షన్‌ కింగ్‌లు... తితిదే హుండీకి వెళ్ళాల్సిన కానుకలను అప్పనంగా నొక్కేస్తున్నారు తిరుచానూరులోని తితిదే సిబ్బంది. అమ్మవారి దర్శనం పేరు

అదేంటి.. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కదా... పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏంటి అనుకుంటున్నారా... తితిదే సిబ్బందే ఇక్కడ కలెక్షన్‌ కింగ్‌లు... తితిదే హుండీకి వెళ్ళాల్సిన కానుకలను అప్పనంగా నొక్కేస్తున్నారు తిరుచానూరులోని తితిదే సిబ్బంది. అమ్మవారి దర్శనం పేరుతో సాక్షాత్తు పద్మావతి దేవి ముందే వేల రూపాయలు సంపాదించేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నీ తెలిసినా తితిదే ఉన్నతాధికారులు మాత్రం చేతులు కట్టుకుని కూర్చుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
పద్మావతి అమ్మవారు. సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామికి సతీమణి. స్వామివారిని దర్శించుకునే భక్తుల్లో సగానికిపైగా భక్తులు తిరుచానూరుకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అయితే తిరుచానూరులో తితిదే సిబ్బంది చేతివాటం అంతా ఇంతా కాదని భక్తులు వాపోతున్నారు. తితిదే సిబ్బంది లంచావతారాలతో తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని అంటున్నారు.
 
తితిదే సామాన్య భక్తుల కోసం సర్వదర్శనం లైను, 20 రూపాయల లైను, 100 రూపాయల విఐపి లైను, 200 రూపాయల కుంకుమార్చన టికెట్లను ఏర్పాటు చేసింది. కొంతమంది విఐపిలు టికెట్లు కొనుక్కుని కుంకుమార్చన చేయించుకుంటుంటారు. అయితే వారికి తితిదే పండితులు సపర్యలు చేసి చివర్లో చేతులు చాచటం మామూలైందని అంటున్నారు. అమ్మవారి చెంత పనిచేసే పండితులే డబ్బులు అడుగుతుండటంతో ఇక చేసేది లేక చాలామంది భక్తులు కళ్లు మూసుకుని డబ్బు నోట్లు పెట్టేసి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది భక్తులైతే హుండీలో వేయాల్సిన డబ్బులనే పండితులకే సమర్పించుకోవడం కనబడుతోంది. కారణం..హుండీలో వేసినా..వీరికిచ్చినా ఒకటేనన్నది వారి అభిప్రాయం. ఇలా అమ్మవారి హుండీ ఆదాయానికే కొంతమంది తితిదే పండితులు గండి కొడుతున్నారనే విమర్శ వస్తోంది.
 
ఇక కొంతమంది తితిదే సిబ్బంది అయితే నేరుగా విఐపి(పార్టీ)లను బయటే మాట్లాడుకుని డైరెక్టుగా ఆలయంలోకి తీసుకువచ్చి (టిక్కెట్టు లేకుండా) దగ్గరుండి దర్శనం చేయించి మరీ పంపుతున్నారనే విమర్శలు సైతం వస్తున్నాయి. అన్నీ అయిపోయిన తరువాత బయటకు వెళ్ళి చేతులు చాపడం ఇక మామూలే.
 
అంతేకాదు ఆలయంలో పనిచేసే మరికొంతమంది సిబ్బంది సామాన్య భక్తులు క్యూలైన్ల నుంచి అమ్మవారిని దర్శించుకునే సమయంలో ఎవరైనా 50 రూపాయలో, 100 రూపాయలో ఇస్తే ఇక వారిని అక్కడే ఒక నిమిషం పాటు నిలబెట్టేస్తారు. 50 రూపాయలిస్తే ఒక్క నిమిషం, వందరూపాయలైతే రెండు నిమిషాలు.. అలా ప్రతిరోజు వేలల్లో వీరు డబ్బులు సంపాందించేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయం విషయం అలా ఉంచితే ప్రసాదాలు అందించే వారు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు విఐపిలకు ప్రసాదాలను నేరుగా ప్లేట్లలో తీసుకెళ్ళి ఇచ్చి చేతులు చాస్తున్నారని భక్తులు చెపుతున్నారు.
 
పదోపరకో తీసుకుంటే గానీ వారు అక్కడి నుంచి వెళ్లరు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో చేతులు చాస్తూనే ఉన్నారు. ఈ విషయం తితిదే ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నోసార్లు కొంతమంది భక్తులే తీసుకెళ్ళారు. అయినా ఫలితం లేదు. యథారాజా.. తథా ప్రజా.. అన్నట్లు ప్రస్తుతం ఉన్నతాధికారుల తీరు అలాగే ఉంది. దీంతో తితిదే సిబ్బంది, పండితులు అందరూ ఎవరికి తోచినట్లు వారు చేతులు చాస్తూ లాగేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.