శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : సోమవారం, 11 మే 2015 (11:04 IST)

తెలంగాణాలో టీడీపీకి టీఆర్ఎస్ ఎర్త్...? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు గాలం..!

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రసమితి సెగ పెడుతోందా...! గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందా.. !! ఇందుకోసం తెలంగాణ రాష్ట్రసమితి అధిపతి, గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారా..!!! ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఇదే ఫీవర్ కలవరపెడుతోంది. తమ ఎమ్మెల్యేలను ఎగరేసుకుపోతారనే భయం పట్టుకుంది. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. 
 
వచ్చే నెల 1న తొలుత ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు సీక్రెట్‌ బ్యాలెట్‌ విధానంలో జరుగుతాయి. ఇదే తెలుగుదేశం కొంప ముంచుతోంది. ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని టీడీపీ ఎమ్మెల్యే ఓట్లను చీల్చే ప్రక్రియకు గులాబీ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇందు కోసం నియోజకవర్గాల అభివృద్ధిని ఆశ చూపుతున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలను కారెక్కించు కోవడం లేదంటే కారు డిక్కీలో దాచేసే ప్రయత్నాలు చేయడంలో గులాబీ పార్టీ బాగానే సక్సెస్‌ అయినట్లు కనబడుతోంది. మొన్నటి మొన్న ఇబ్రహీంపట్నంకు చెందిన మంచిరెడ్డి కిషన్‌ రెడ్డిని కారెక్కించుకున్నారు. మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి టీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. 
 
వీరిలో ఒకరు తన నియోజకవర్గానికి తాగునీరు, మురుగునీటి కాలువలను మంజూరు చేస్తే తాను టీఆర్ఎస్ కు మద్దితివ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. మరో ఎమ్మెల్యే మాత్రం కాస్త అదను కోసం ఎదురు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో ఇద్దర్ని చేర్పించుకోవడానికి మంతనాలు సాగుతున్నట్లు సమాచారం. 
 
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరుపున 15మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. వీరిలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి ఇప్పటికే కారెక్కగా గత నెల 24న జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి కారెక్కారు.
 
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కేసీఆర్ ఏకంగా తన కేబినెట్‌లోకి తీసుకోగా..మిగతా శాసనసభ్యుల నియోజకవర్గాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారు. ఇటీవలనే కారెక్కిన కిషన్‌ రెడ్డి నియోజకవర్గ మైన ఇబ్రహీంపట్నం అభిృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. 
 
రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా ఇదే దారిలో ఉన్నట్లు సమాచారం. మరో ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు కూడా టీడీపీని వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన కూడా పలు డిమాండ్లను సీఎం కేసీఆర్‌ వద్ద ఉంచారని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలలో సాయం చేసినా, లేదా నాటికి తమ పార్టీలో చేరిన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని కేసీఆర్ వారికి భరోసా ఇస్తున్నట్లు సమాచారం. టీఆర్ ఎస్ లక్ష్యం కూడా తమపై దాడి చేస్తున్న తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడమే. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలనే వేదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.