శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2014 (13:26 IST)

గవర్నర్ పవర్స్ : టి సర్కారు ఆందోళన.. ఏపీ ఆచితూచి అడుగులు...

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు కట్టబెట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతోంది. అదేసమయంలో కేంద్రం కూడా టీ ప్రభుత్వ ధిక్కార వైఖరిపై మండిపడుతోంది. టీ సీఎం కేసీఆర్ కొరివితో తలగోక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ హెచ్చరికలు చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ పరిణామాలన్నింటిని నిశితంగా గమనిస్తోంది. 
 
ఈ చట్టంలోని సెక్షన్ 8ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటీషన్ వేసినా.. కేంద్రంపై ఒత్తిడి చేసినా అపుడు జోక్యం చేసుకోవాలన్న తలంపులో ఉంది. హైదరాదబాద్‌లోని సీమాంధ్రులకు ఈ సెక్షనే రక్షణ కవచంగా ఉంది. దీన్ని తొలగించాలని ప్రయత్నిస్తే కోర్టుకెక్కాలని భావిస్తోంది. అసలు ఏ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉంది... అక్కడ ఉన్న తమకు ఏ చట్టం ప్రకారం, ఏ రకమైన రక్షణ లభిస్తుంది అనే ప్రశ్నలకు కోర్టు ముందు ఉంచాలని ఏపీ సర్కారు భావిస్తోంది. 
 
మరోవైపు ఈ సెక్షన్ 8ను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉంది. అలాగే గవర్నర్‌కు అధికారాలను కేంద్రం కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టుకెళ్లితే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 కూడా రాజ్యాంగ విరుద్ధమేనని న్యాయ నిపుణులు ఏపీ సర్కారుకు తెలిపారు. ఈ పాయింట్‌తో మొత్తంగా రాష్ట్ర విభజన బిల్లు కూడా రాజ్యాంగ విరుద్ధమనే విచిత్ర పరిస్థితిని కల్పించాలని భావిస్తోంది.