శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (13:17 IST)

నేను పోనుగాక పోను.... తిరుమల కొండపై తిష్టవేసిన తితిదే జెఈఓ శ్రీనివాసరాజు

తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే పేరుగాంచిన ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల వ్యవహారాలన్నింటినీ చూసే ధార్మిక సంస్థ. వేల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడడంతో పాటు శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు సౌకర్యాలను క

తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే పేరుగాంచిన ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల వ్యవహారాలన్నింటినీ చూసే ధార్మిక సంస్థ. వేల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడడంతో పాటు శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు సౌకర్యాలను కల్పించేందుకే ఈ ధార్మిక సంస్థ ఏర్పాటైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉన్నతాధికారులు నిజంగా అదృష్టవంతులేనని చెప్పవచ్చు. ఐఎఎస్‌ చదివిన ప్రతి ఒక్కరు తిరుమలలాంటి పుణ్యక్షేత్రంలో పనిచేయాలన్న కోరిక ఖచ్చితంగా ఉంటుంది. 
 
స్వామివారి చెంత పనిచేయడమే ఒక్కటే కాదు ప్రపంచంలోని ప్రముఖులందరు అతి సులువుగా పరిచయమయ్యే ప్రాంతం కూడా ఇదే. అందుకే ఈ దేవస్థానంలో పనిచేయడానికి ఎంతోమంది అధికారులు పోటీలు పడుతుంటారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి కావాల్సిన అధికారులనే తితిదేకి ఉన్నతాధికారులుగా నియమిస్తుంటారు. అధికారిని నియమించిన రెండు సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి బదిలీ చేసేస్తుంటారు. అయితే ప్రస్తుతం తితిదే జేఈఓగా శ్రీనివాసరాజు మాత్రం ఇంతవరకు బదిలీ కాలేదు. అసలు తితిదే చరిత్రలోనే ఇన్ని యేళ్ళుగా జేఈఓగా పనిచేసిన అధికారి కూడా ఇప్పటివరకు ఎవరూ లేదు. అసలు శ్రీనివాసరాజును ఎందుకు జెఈఓగా కొనసాగిస్తున్నారో.. ఎవరికీ అర్థం కావడం లేదు. 
 
జెఈఓ శ్రీనివాసరాజు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తే ఈయన. ఏపీలో పుట్టిపెరిగి చదువంతా తెలంగాణాలోనే పూర్తి చేశారు. జూనియర్‌ ఐఎఎస్‌గా ఉన్న శ్రీనివాసరాజు ఒక్కసారిగా నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల జెఈఓగా అరగేట్రం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారారే తప్ప శ్రీనివాసరాజు మాత్రం అక్కడి నుంచి మారలేదు. నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న స్నేహితుల ద్వారా రెకమెండేషన్‌ చేయించుకుని జెఈఓగా వచ్చారు శ్రీనివాసరాజు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం పోయి ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎంతోమంది ఐఎఎస్‌లు బదిలీలపై వెళ్ళిపోయారు. కానీ తిరుమల జెఈఓ మాత్రం ఇక్కడి నుంచి కదలనే లేదంట. 
 
తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు బదిలీ కాకపోవడానికి సీఎం చంద్రబాబునాయుడు తనయుడు నారాలోకేష్‌ కారణమని తెలుస్తోంది. నారాలోకేష్‌ స్నేహితుల ద్వారా బదిలీలను ఆపుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అంతేకాదు మాజీ ప్రధాని దేవగౌడ ద్వారా కూడా సిఎం చంద్రబాబునాయుడుకు చెప్పించుకుని బదిలీలను ఆపుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం ద్వారా పరిచయమైన ప్రముఖుల పరిచయాలతోనే ప్రస్తుతం జెఈఓగా కొనసాగుతున్నారు. 
 
సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కష్టపడి పనిచేసే అధికారికి గుర్తింపు నిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇప్పటిది కాదు తొమ్మిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఐఏఎస్‌‌లన్నా, ఐపీఎస్‌లన్నా ఎంతో గౌరవం. అందుకే సీనియర్లు, జూనియర్లన్న భేదాలను చూడకుండా కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తారు. అలాంటిది శ్రీనివాసరాజు విషయంలో మాత్రం బాబు పట్టించుకోవడం లేదు. శ్రీనివాసరాజు పెద్దగా పనిచేసిన దాఖలాలు కూడా లేవు. జెఈఓ అంటేనే పరిపాలనా. సామాన్య భక్తులకు అవసరమైన నిర్ణయాలు. కానీ ఈ జెఈఓ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. కేవలం సేవా టికెట్లపైనే ఈయన దృష్టంతా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.
 
ప్రస్తుతం తిరుమల జెఈఓ వ్యవహారంలో మాత్రం చంద్రబాబు సైలెంట్‌గా ఉండటానికి రాజకీయ ప్రముఖుల సిఫారసు కారణమని తెలుస్తోంది. అయితే మిగిలిన ఐఏఎస్‌లు మాత్రం జెఇఓను మార్చరా అంటూ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళారు. ఐఎఎస్‌ల సంగతి అటుంచింతే తితిదే ఉద్యోగులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క జెఈవో ఇన్ని రోజులు ఉండడం ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారు. త్వరలో జరుగనున్న ఐఎఎస్‌ల బదిలీలలోనైనా శ్రీనివాసరాజును మారుస్తారన్న నమ్మకంతో ఉన్నా తితిదే ఉద్యోగులు, తితిదే జెఈవో పదవి కోసం పోటీపడుతున్న ఐఎఎస్‌లు.