శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2016 (15:20 IST)

తిరుమల నిత్యాన్నదాన భోజనమా... వద్దు బాబోయ్‌ వద్దు...

పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ఈ సామెత తిరుమల తిరుపతి దేవస్థానానికి సరిగ్గా సరిపోతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే సంవత్సరానికి వంద కోట్ల రూపాయలకుపైగా ఆదాయం ఉండే నిత్యాన్నదాన పథకాన్ని తితిదే నడుపుతున్న తీరు అలాంటిది. కొన్ని విషయాల్లో తితిదేని మెచ్చుకున్నా మరికొన్ని వాటిలో విమర్శలు చేయక తప్పదు. అందులో ప్రధానమైనది నిత్యాన్నదాన పథకం. ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం పెట్టే పథకమే నిత్యాన్నదాన పథకం.
 
ప్రతిరోజు 50 వేల నుంచి 60 వేల మందికిపైగా భక్తులు తిరుమలకు వస్తుంటారనేది అందరికీ తెలిసిన విషమయే. అందులో కనీసం 20 వేల మందికి పైగా భక్తులు తితిదే ఆధ్వర్యంలో నడిచే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సముదాయంతో పాటు మిగిలిన అన్నదాన సముదాయాల్లో భోజనం చేస్తుంటారు. అయితే తితిదే పెట్టే భోజనం రోజురోజుకు నాణ్యతతో పాటు రుచి తగ్గుతోందని భక్తులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. 
 
సరిగ్గా ఉడికించీ ఉడికించని భోజనం, కంటికి కనిపించని కూరగాయల ముక్కలతో తయారు చేసిన సాంబారు, నీళ్ళ రసం, పెరుగే కనిపించని మజ్జిగ. ఇదీ నిత్యాన్నదాన పథకం ద్వారా తితిదే పెట్టే భోజనం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నిత్యాన్నదాన పథకం ఎంతమాత్రం నడుస్తుందో.. నిత్యాన్నదాన పథకానికి గతంలో ఎంతో పేరుండేది. అయితే పేరు మొత్తం పూర్తిగా కొట్టుకుపోవడానికి తితిదే సిబ్బందే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచే నిత్యాన్నదాన పథకం ద్వారా భక్తులకు భోజనం పెడుతుంటారు. భక్తులు ఎంత భోజనం చేస్తారో అంత భోజనాన్ని తితిదే పెడుతుంది. అయితే ఒకసారి భోజనాన్ని పెట్టుకున్న భక్తులు మరోసారి పెట్టుకోవడం లేదంటే రుచి ఏమాత్రం ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. 
 
గతంలో నిత్యాన్నదాన పథకం అంటే గట్టి పప్పు. చూస్తేసే తినాలనిపించే తెల్లటి అన్నం. చిక్కనైన సాంబారు, కొత్తమీర సువాసనతో రసం. గడ్డ పెరుగు లేకుంటే చిక్కటి మజ్జిగ. అయితే ఇవన్నీ గతంలోనే.. కానీ ప్రస్తుతం అవన్నీ పూర్తిగా రివర్సయి పోయాయి. ఎంతో భక్తి భావంతో స్వామివారి నిత్యాన్నదాన పథకంలో భోజనం చేద్దానుకుని వచ్చే భక్తులకు చివరకు నిరాశే మిగులుతోంది.
 
 
తిరుమలకు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అందులో 90 శాతంకుపైగా భక్తులు గతంలో నిత్యాన్నదాన పథకంలోనే భోజనం చేసేవారు. అంటే అప్పట్లో ఎంతమాత్రం రుచి ఉంటుందో చెప్పనవసరం లేదు. అన్నం తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుంది. కడుపు నిండా అన్నం తినిగాని భక్తులు వెనుదిరిగే వారు కాదు.. ఆ విధంగా ఉండేది భోజనం. 
 
నిత్యాన్నదాన పథకానికి దాతలు కోట్ల రూపాయల్లో విరాళాలు ఇస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం రూ.50 కోట్లకుపైగా నిత్యాన్న పథకానికి విరాళాలు అందుతున్నాయి. 2015 నుంచి 2016 సంవత్సర మధ్య కాలంలో అయితే వంద కోట్ల రూపాయల విరాళాలు తితిదే చేరాయి. తితిదే చరిత్రలోనే ఇది చరిత్రే. దాతలు కూడా భక్తులను దృష్టిలో ఉంచుకునే నిత్యాన్నదాన పథకానికి కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్నారు. అయితే తితిదే మాత్రం ఆ మొత్తాన్ని బ్యాంకులలో జమ చేసుకుంటోంది తప్ప సరైన భోజనం పెట్టలేదన్న ఆరోపణలు లేకపోలేదు. 
 
తిరుమలలో భక్తులకు ఉచితంగా పెట్టేది ఒక భోజనం మాత్రమే. సుదూర ప్రాంతాల నుంచి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు భక్తులు. కనీసం నాణ్యమైన, రుచితో కూడిన భోజనం పెడితే భక్తులు ఎంతో సంతోషంతో భోజనాన్ని భుజించి వెళతారు. అయితే అందుకు విరుద్ధంగా తితిదే వ్యవహరిస్తోంది. ఏదో భిక్షగాళ్ళకు పెట్టిన విధంగా భోజనాన్ని భక్తులకు పంపిస్తుందన్న ఆరోపణలు లేకపోలేదు. 
 
నాణ్యతలేని భోజనం పెడుతున్నారని ఎంతోమంది భక్తులు ఏకంగా డయల్‌ ఈవో కార్యక్రమంలో తితిదే ఈవోకు ఫిర్యాదులు కూడా చేశారు. అంతేకాదు నేరుగా కూడా తితిదే ఛైర్మన్‌కు విన్నవించుకున్నారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్న చందంగా తితిదే ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా నిత్యాన్నదాన పథకంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైనదే కాకుండా రుచికరమైన భోజనాన్ని తమకు అందించాలని భక్తులు కోరుకుంటున్నారు.