శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR

ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఎక్కడ బిల్లులు అక్కడే!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి లలిత్ మోడీ, వ్యాపం కుంభకోణాలపైనే ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో, కీలకమైన జీఎస్‌టీ బిల్లు (వస్తు సేవల పన్ను) ఆమోదం పొందలేకపోయింది. సమావేశాల ముగింపు సందర్భంగా, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ మాట్లాడుతూ, ఈ సమావేశాల్లో మొత్తం 34 గంటల సమయం వృథా అయిందన్నారు. సభలో ప్లకార్డులను ప్రదర్శించరాదని తాను పలుమార్లు కోరినప్పటికీ... కొందరు సభ్యులు ప్లకార్డులతో వచ్చి సభను ఆటంకపరిచారని అన్నారు. భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో అయినా ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆమె కోరారు. 

అయితే ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు భావించిన అత్యంత ప్రతిష్టాత్మక బిల్లులైన వస్తు సేవల పన్ను, బీమా సంస్కరణలు, భూసేకరణ, విదేశీ ఎఫ్‌డీఐ వంటి అనేక బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ అందుకు ఏమాత్రం సహకరించలేదు. ఫలితంగా ఎక్కడ బిల్లులు అక్కడే ఉండిపోయాయి. 
 
వాస్తవానికి ఈ సమావేశాలు గత నెల 21వ తేదీన ప్రారంభమయ్యాయి. నాటి నుంచి నేటి వరకు ఒక్కకంటే ఒక్క ప్రజా సమస్యపై కూడా చర్చకు జరగలేదు. ఉభయ సభలను లలిత్ గేట్ అంశమొక్కటే కుదిపేసింది. ఫలితంగా అరుపులు, కేకలు, మాటల యుద్ధం, సస్పెన్షన్లు, ధర్నాలు, నిరసనలు, విమర్శలు, ప్రతివిమర్శలతోనే దద్ధరిల్లిపోయింది. లలిత్ గేట్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు రాజీనామాలు చేస్తే మాత్రమే సభ సజావుగా నడిచేందుకు సహకరిస్తామని, లేకుంటే అడ్డుకుంటామని స్పష్టం చేసిన కాంగ్రెస్ తన మాట నిలుపుకుంది. 
 
ఫలితంగా ఉభయసభల్లో ఏ ఒక్క అంశంపై అర్థవంతమైన చర్చ సాగలేదు. పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులకు మోక్షం లభించలేదు. కొత్త బిల్లులకు అవకాశమే లేకుండాపోయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొండి వైఖరి వల్లే విలువైన సమయం వృథా అయిందని బీజేపీ ఆరోపిస్తుంటే, సభలో చర్చలు జరగకపోవడానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. దేశాభివృద్ధికి దోహదపడే ఎన్నో ముఖ్యమైన బిల్లులు పెండింగులో ఉండిపోగా, నాలుగేళ్ల నాడు దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోడీ చుట్టూ నేతలు తిరుగుతూ ఉండిపోయారు.