శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 19 మార్చి 2015 (16:25 IST)

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాం.. చర్చకు వస్తేనే వెళ్తాం: జగన్

శుక్రవారం నుంచి అసెంబ్లీకి వెళ్లట్లేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సభాపతి కోడెల శివప్రసాద్‌పైన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని, అది చర్చకు వచ్చినప్పుడే తాము సభకు వెళ్తామని జగన్ గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బడ్జెట్ పైన చర్చ జరిగితే లెక్కలతో సహా చెబుతాననే తమను బయటకు పంపించారన్నారు. 40 రోజులు జరగాల్సిన సమావేశాలను 17 రోజులకు కుదించారన్నారు. 
 
ప్రతిపక్షానికి గంట కన్నా ఎక్కువ సమయం ఇవ్వరా అని జగన్ ప్రశ్నించారు. తాను బడ్జెట్ పైన మాట్లాడుతుంటే పదేపదే అడ్డుపడ్డారన్నారు. నాలుగు రోజుల పాటు బడ్జెట్‌పైన చర్చ అని, ఒక్క రోజుతో మమ అనిపించారన్నారు. తనకు ఇచ్చిన గంటలో పలుమార్లు అధికార పార్టీ అడ్డుపడిందన్నారు. ఎప్పటికప్పుడు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా, తాను మాత్రం సబ్జెక్ట్‌కే పరిమితమయ్యానని చెప్పారు. 
 
తాను మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. తాను మాట్లాడుతుండగా.. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు తదితరులు పలుమార్లు తీసుకున్నారని, సమయంతో సహా జగన్ చెప్పారు. మంత్రులు అడ్డు తగలడాన్ని ప్రశ్నిస్తే తమ సభ్యులను ఎనిమిది మందిని సస్పెండ్ చేశారన్నారు.
 
సభను దారుణంగా సభను నడపడమే కాకుండా, ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమను ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడో వెళ్తామని చెప్పారు. అవిశ్వాసంపై చర్చకు వచ్చినప్పుడే సభకు వెళ్తామన్నారు. సభకు తాము వెళ్లమని స్పష్టం చేశారు.  వాళ్ల గొంతే వినిపించుకోనియండని అన్నారు. వాళ్లే చర్చించుకోనీయండని విమర్శించారు.
 
తనను బెంగళూరు నుండి తీసుకు రావొద్దని రోశయ్య వద్ద తన తల్లి విజయమ్మ మొరపెట్టుకున్నట్లుగా చెప్పడం దారుణమన్నారు. తాను 1999 నుండి వైయస్ చనిపోయేదాకా తాను బెంగళూరులోనే ఉన్నానని, అలాంటప్పుడు ఇంత దారుణ ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. తనను వచ్చేలా చేయవద్దని రోశయ్యకు చెప్పేందుకు తన తల్లికి ఆయన ఏమైనా పెద్దనాన్ననా లేక చిన్నాన్ననా అని ఎద్దేవా చేశారు.
 
తాను మొదటి నుండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని అని చెప్పారు. తాను అసలు శివశివానీ స్కూలులో చదవనే లేదని చెప్పారు. తాను అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని దయచేసి మీడియా రిపీటెడ్‌గా వేయాలని, లేదా చివరి పది నిమిషాలైనా వేయాలని, ప్రజలకు నిజాలు చెప్పాలని కోరారు. తాము వాస్తవాలు మాట్లాడుతుంటే అధికార పక్షం భయపడుతోందన్నారు. సభలో తాను మాట్లాడిన వీడియోలో ఎక్కడైనా తప్పు మాట్లాడినట్లు కనిపిస్తే తనను అడగవచ్చునన్నారు. 
 
 ఆంధ్రజ్యోతి, ఈనాడులకు విజ్ఞప్తి ఆంధ్రజ్యోతి, ఈనాడులకు వైయస్ జగన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తాను సభలో మాట్లాడిన గంట పాటు స్పీచ్ వేసినా వేయకపోయినా... చివరి పది నిమిషాల ప్రసంగం ప్రజలకు చూపించాలని ఆయన కోరారు. ఈ ప్రెస్ మీట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఉన్నప్పటికీ.. వారు ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు.