శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2015 (07:50 IST)

who is big boss in TDP.... పెద్దబాబా..! చిన్న బాబా..!!

నాడు రాజశేఖర్ రెడ్డి అయినా... నేడు చంద్రబాబు అయినా తెర ముందు నాయకులు మాత్రమే... తెర వెనుక పాత్రలు, పాత్రధారులు మారూతూనే ఉన్నారు. వారిని ఆడించే సూత్రధారులు ఎందరో ఉన్నారనడంలో అనుమానం లేదు. నేడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే స్థితి నెలకొందని తెలుస్తోంది. 
 
నాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నంత కాలం వైఎస్ జగన్ చక్రం తిప్పారనే ఆరోపణలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. రాజ్యాంగేతర శక్తి అనే పెద్ద పెద్ద మాటలు కూడా వినిపించాయి. ఆయన బెంగళూరులో ఉంటూనే ఏ నాడు పార్టీ కార్యాలయానికి గానీ, సచివాలయానికి కానీ రాకుండానే అధికార పెత్తనాన్ని చెలాయించారని చెబుతుండేవారు. నేడు సేమ్ టు సేమ్ లోకేష్ బాబు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లి విరుస్తున్నాయి. 
 
పార్టీలోని సీనియర్లు పెదవి విరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబే అయినా, పార్టీ కార్యక్రమాలు మొదలుకుని ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా చిన్నబాబు నారా లోకేష్ కలుగుజేసుకుంటున్నారనే నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజా పరిణామాలెన్నో ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 
 
ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన మంత్రుల తనయలు అప్పట్లో పెత్తనం చెలాయిస్తున్నారని పార్టీ సంక్షేమ నిధికి కన్వీనర్‌గా ఉన్న నారా లోకేష్ వారిని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పిలిపించి క్లాసు పీకారట. తాము ఇంత సీనియర్లు అయి ఉండి లోకేష్ చేతిలో క్లాసు పీకించుకోవాల్సిన స్థితి రావడంపై అప్పట్లోనే మంత్రులు మధన పడ్డారట. ఎలాంటి పనులున్నా.. మొదట చిన్నబాబు దర్శనం చేసుకోవాల్సి వస్తోందని తెలుగుదేశం పార్టీలోని నాయకులే వాపోతున్నారు. 
 
లోకేష్‌కు ట్యూషన్ చెప్పాను కుర్రకుంక అన్నట్లు వ్యవహరించిన ఓ మంత్రి ఆ తరువాత హెచ్చరికలతో నోరు పారేసుకోవడం మానుకున్నారట. ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలుకొట్టే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. అయితే చిన్నబాబు ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన వెనుదిరిగారు. పార్టీలో సీనియర్లు ఉంటూ, ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఇలాంటి అవమానాలు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన చెందే వారి సంఖ్య అధికమవుతోంది. అసలు తెలుగుదేశం పార్టీలో బిగ్ బాస్ ఎవరు? లోకేష్‌నా...! చంద్రబాబా...!!