శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 19 మే 2015 (13:25 IST)

తెలుగుదేశం పార్టీతో పవన్ తెగదెంపులు చేసుకుంటారా...?

ఎన్నికల సమయంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జనసేన, తెలుగుదేశం పార్టీలు విడిపోనున్నాయా.. ! పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో రాజధాని భూములపై తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పవన్ కినుకు వహించేలా చేసినట్లు తెలుస్తోంది. అసలు జనసేన పార్టీ ఎక్కడ.? అదసలు రాజకీయ పార్టీయేనా.? అని తెలుగుదేశం నాయకులు చేసే వ్యాఖ్యలతో పవన్‌‌కు కోపం వచ్చిందట. ఆయన అనుచరులు ఆగ్రహిస్తున్నారట. ! ఇవి అగ్గికి ఆజ్యంలా తయారయ్యాయట.  
 
గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయిలోనూ, భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలోనూ మద్దతిచ్చింది జనసేన పార్టీ. ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, కేంద్రంలో నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకి అధికారమివ్వండి.. అంటూ ప్రచారం చేశారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రాగా, కేంద్రంలో బీజేపీ అధికార పీఠమెక్కింది. తెలంగాణ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. ఇదంతా జరిగి ఏడాది కాలం కావస్తోంది. ఇప్పుడెందుకు ఈ కథంతా..? 
 
అప్పటి నుంచి అడపాదడపా ఇక్కడ చంద్రబాబుకు పవన్ ఊరటనిస్తూనే ఉన్నారు. కేవలం టీడీపీని గద్దెనెక్కించడానికే పవన్‌ జనసేన పార్టీని పెట్టినట్లయ్యింది. ఎక్కడా పార్టీ నిర్మాణం లేకపోయినా పవన్ పలుకుబడి ఎక్కడా తగ్గలేదు అనేది చాలా స్పష్టం. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం విషయంలో రైతుల నుంచి బలవంతపు భూ సమీకరణ జరగడాన్ని పవన్‌ ప్రశ్నించారు. అవసరమైతే పోరాటం చేస్తానని చెప్పారు. 
 
అలా పవన్‌ ప్రశ్నించడాన్ని టీడీపీ నేతలు ఖండించేశారు. వెరసి పవన్‌, టీడీపీ మధ్య గ్యాప్‌ పెరిగింది. ఆ పెరిగిన గ్యాప్‌‌ను పూడ్చే ప్రయత్నాలు జరుగలేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇటీవలే భూ సేకరణ కోసం ఏపీ సర్కార్‌ జీవో జారీ చేయడం పవన్‌కళ్యాణ్‌కి ఆగ్రహం తెప్పించిందట. తాను మద్దతిస్తే అధికారంలోకి వచ్చిన పార్టీ, తన సూచనల్ని పక్కన పెట్టడం పవన్‌ కళ్యాణ్‌కి రుచించడంలేదట. దీంతో పవన్‌ టీడీపీపై గరంగరంగా ఉన్నారట. 
 
ఒకప్పుడు పవన్‌ని ఆకాశానికి ఎత్తిన టీడీపీయే ఇప్పుడు పవన్‌ చుట్టూ విషం కక్కించే ప్రయత్నాలు చేస్తోంది. పవన్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా తమ మీడియాతో వార్తలు రాయిస్తోందని పవన్ మండిపడుతున్నారట. పవన్ కోసమని సుదీర్ఘ ప్రణాళిక కలిగిన రాజధానిని వదులుకోలేమని కొందరు తెలుగుదేశం నాయకులు పబ్లిక్‌గానే మాట్లాడుతున్నారట.

ఇది కూడా పవన్‌కు పుండు మీద కారం చల్లినట్లు ఉందంటున్నారు. ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నప్పటికీ తెలుగుదేశంతో పవన్ తెగతెంపులు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారట.  రైతులకు మద్దతుగా పోరాడుతారా లేదా అనే అంశంపైనే ఆయన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.