శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 29 జులై 2015 (15:23 IST)

రాష్ట్రపతిని మళ్లీ క్షమాభిక్ష కోరిన మెమన్.. చార్టెడ్ అకౌంటెంట్ దోషి ఎలా అయ్యాడు?

ముంబై వరుస పేలుళ్లలో దోషిగా తేలిన యాకూబ్‌ మెమన్‌ మరోమారు ప్రాణభిక్ష ప్రసాదించమని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. తనకు విధించిన ఉరిశిక్షను రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతిని ప్రాధేయపడుతున్నాడు.
 
 
నిజానికి మెమన్ గతంలో పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తోసిపుచ్చారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఆయనకు ఉరిశిక్షను ఖరారు చేయడంతోపాటు ఈ నెల 30న ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాగపూర్‌ జైల్లో యాకూబ్‌ను ఉరి తీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
 
మరోవైపు.. ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ మెమన్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించాల్సి వుంది. అదేసమయంలో యాకూబ్ మెమన్ క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. 
 
అయితే, యాకూబ్ మెమన్ ఈ కేసులో ఎలా చిక్కాడో విశ్లేసిస్తే... యాకూబ్ మెమన్‌... ఓ ఉగ్రవాది. ముంబై పేలుళ్ల సూత్రధారి. ఎంతో మంది చనిపోవడానికి కారకుడు అని ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుతున్నారు. నిజానికి మెమన్ పెద్ద చార్టెడ్‌ అకౌంటెంట్. అంతేకాదు అప్పట్లో బెస్ట్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌గా అవార్డు కూడా పొందాడు. అంతేకాదు స్నేహితులతో కలిసి ఒకటి, సొంతంగా ఒకటి (మెహతా అండ్ మెమన్‌, AR అండ్ సన్స్‌) మొత్తంగా రెండు కంపెనీలు స్థాపించాడు.
 
అలాంటి వ్యక్తి ముంబై పేలుళ్ళ కేసులో ఎలా చిక్కాడనే కదా మీ ప్రశ్న. అప్పట్లో అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న దావుద్‌ ఇబ్రహీంకు, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్‌కు ఆర్థికంగా సాయపడ్డాడు. ముఖ్యంగా 15 మందికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చేనిమిత్తం పాకిస్థాన్‌కు పంపించేందుకు అయ్యే ఖర్చులను భరించాడు. అలాగే, ముంబై పేలుళ్ళకు ముందు ఈ మారణహోమంలో పాల్గొన్నవారికి కార్లు సమకూర్చారు. అలా 1993 మార్చి 12 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ళ కేసులో బుక్కయ్యాడు. 
 
ఈ కేసులో 1994, ఆగస్టు 4వ తేదీన మెమన్ అరెస్టు అయ్యాడు. 13 యేళ్ల తర్వాత అంటే 2005, జూలై 27వ తేదీన మెమన్‌కు ఉరిశిక్ష పడింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు అంటే 2013, మార్చి 21న ఉరిశిక్ష నిర్ధారణ అయింది. తనకు వేసిన శిక్షను మార్చమని మెమన్‌ వేసిన పిటీషన్‌ను 2013, జూలై 30న సుప్రీంకోర్టు తిరస్కరించింది. 
 
ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌ను 2014, ఏప్రిల్ 11న తిరస్కృతికి గురైంది. ఆ తర్వాత 2014, జూన్‌ 1న అమలు చేయాల్సిన ఉరిశిక్షపై కోర్టు స్టే విధించింది. దీనిపై మళ్లీ 2015, మార్చి 24న విచారణ జరిగింది. చివరకు 9 ఏప్రిల్‌ 2015న మెమన్‌ పిటీషన్‌ అత్యున్నత ధర్మాసనం కొట్టివేస్తూ.. 2015, జూలై 30న శిక్షను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.