శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: గురువారం, 21 జులై 2016 (13:09 IST)

ఇప్పుడు కాదు... కాస్త ఓపిక పట్టండి... ఎమ్మెల్యే రోజా... ఎందుకు?

సినీనటి, నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా తెలుగుదేశంపార్టీలోకి చేరడం కాస్త ఆలస్యమవుతోంది. తెదేపా నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తరువాత ఆ పార్టీలోకి వెళ్ళాలని రోజా నిర్ణయించున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేపట్టిన నవనిర్మాణ

సినీనటి, నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా తెలుగుదేశంపార్టీలోకి చేరడం కాస్త ఆలస్యమవుతోంది. తెదేపా నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తరువాత ఆ పార్టీలోకి వెళ్ళాలని రోజా నిర్ణయించున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేపట్టిన నవనిర్మాణ దీక్షలో కనిపించి జగన్‌కు షాక్‌ ఇచ్చిన రోజా ప్రస్తుతం సైలెంట్‌గానే పావులు కదులుతున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల క్రితం నగరిలో జరిగిన నియోజవర్గ కార్యకర్తలు, నాయకుల సమావేశం తరువాత రహస్యంగా రోజా తన అనుచరులు, కొంతమంది కార్యకర్తలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. వెంటనే తెదేపాలోకి వెళ్ళిపోదామని చెప్పిన అనుచరులను రోజా బుజ్జగించినట్లు సమాచారం. అంతేకాదు కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని కూడా సూచించినట్లు తెలుస్తోంది.
 
సినీ రంగంలో రోజాకు ఎంత క్రేజుందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక గుర్తింపు సంపాందించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజా ఆ తరువాత సినిమాలకు దూరమవుతూ వచ్చారు. ప్రజాప్రతినిధిగా ఎన్నోసార్లు పోటీ చేసినా ఆమె గెలిచింది మాత్రం ఒక్కసారే. అదీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నగరి నియోజకవర్గం నుంచే.  
 
రోజా రాజకీయ జీవితం గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఆమెకు రాజకీయాల్లో ఒక పేరు కూడా ఉంది. ఆమె ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీ పరిస్థితి గందరగోళంలో ఉంటుందని అధికార పార్టీ సభ్యులే సెటైర్లు వేస్తుంటారు. ఎందుకంటే అలాంటి పరిస్థితిని ఆమె ఎదుర్కొంది. చివరకు వైకాపా పంచని చేరిన రోజా ప్రస్తుతం అక్కడ కూడా వూగిసలాడే ప్రయత్నం చేస్తోంది. తనతో పాటు గెలుపొందిన సహచర ఎమ్మెల్యేలందరు ఒక్కొక్కరుగా తెదేపా తీర్థం పుచ్చుకోవడం, దాంతో పాటు తమ నియోజకవర్గాలను అభివృద్థి వైపు నడిపించుకోవడం చేస్తున్నారు. అయితే తను ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది. దీనితో రోజా కాస్త ఆందోళనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో గతంలో తాను ఉన్న పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆ పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలతో మాటలు కలిపిన విషయం అందరికీ తెలిసిందే. తన సొంత నియోజకవర్గంలో తన ప్రత్యర్థి గాలి ముద్దుక్రిష్ణమనాయుడుతో కలిసి ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణదీక్షలో కూడా ఆమె పాల్గొన్నారు. దీంతో నగరి నియోజకవర్గ ప్రజలే కాదు. ఏపి మొత్తం ఆ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ తరువాత రోజా సైలెంట్‌గా ఉండిపోయారు. కారణం ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వచ్చేటప్పుడు గతంలో చేసిన తప్పే మరోసారి చేయకూడదన్నది ఆమె ఆలోచన.
 
ఇదే ఆలోచనతో ప్రస్తుతం వెళుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్‌ వైకాపా నాయకులందరు కలిసి రెండురోజుల క్రితం నగరిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై అందరు కలిసి దుమ్మెత్తి పోశారు. అయితే రోజా మాత్రం పెద్దగా ప్రభుత్వంపైగానీ, సిఎం చంద్రబాబునాయుడిపై ఎక్కడా కూడా నోరు జారలేదు. రోజా ఎక్కడ నోరు తెరిచినా ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి రోజా ఈ విధంగా మాట్లాడటం పార్టీ సీనియర్‌ నాయకులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
 
మధ్యాహ్నానికే పార్టీ కార్యక్రమం కాస్త ముగిసింది. ఆ తరువాత నగరిలోని ఒక ప్రైవేటు కళ్యాణమండపంలో అతి రహస్యంగా రోజా తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ మార్పుపై సుధీర్ఘంగా వారితో చర్చించారని సమాచారం. చర్చలో అనుచరులు కాస్త తెదేపాలోకి వెంటనే వెళ్ళిపోదామని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని విషయాన్ని రోజా దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అందుకు మాత్రం రోజా ఒకటే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడే పార్టీని మారకూడదని కొద్దిగా ఓపికపట్టండని, దానికి ఒక సమయం వస్తుందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. తన అనుచరులు ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం ఏ మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.