శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 17 మార్చి 2015 (12:12 IST)

అవుటాఫ్ అసెంబ్లీ... స్పీకర్ కోడెలను టార్గెట్ చేస్తున్న వైఎస్ఆర్సిపీ

శాసనసభలో అడుగడుగునా అడ్డుపడుతున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును నిలవరించేందుకు వైఎస్ఆర్ సిపి ఇటు శాసనసభలోనూ.. అటు సభ వెలుపల కూడా టార్గెట్ చేస్తోంది. ఎక్కడ చిన్న అవకాశందొరికినా ఆయనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఆసెంబ్లీలో కాపాడడానికి స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో కొన్ని సందర్భాలలో స్పీకర్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్న తీరున నడుస్తోంది. అయితే స్పీకర్ స్పీడును అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ జోరు పెంచింది. ఇందుకు కోడెల కొడుకును తెరపైకి తెస్తున్నారు. ఆయనపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇందుకు తాజా సంఘటనలే తార్కాణం 
 
నరసరావుపేట రామిరెడ్డిపేటలో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు గ్రామీణ కేబుల్ టీవీ(జీసీ టీవీ) కేంద్ర కార్యాలయంపై దాడిచేసి విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్‌ప్యానెళ్ళు, డిష్‌లను ధ్వంసం చేశారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జీసీ టీవిని కసిరెడ్డి వెంకటకోటిరెడ్డి నిర్వహిస్తున్నారు. ఇది కాస్త జనంలో పేరు ప్రతిష్టలు సంపాందించింది. ఈ నెట్ వర్కును దక్కించుకోవడానికి కె.చానల్ నిర్వాహకుడు, కోడెల శివప్రసాద్ రావు కుమారుడు కోడెల శివరామకృష్ణ జీసీ టీవీని తనకు ఇవ్వాలని, అడిగాడని, అందుగు బదులుగా రెండు వర్క్‌లు ఇస్తానని చెబుతున్నాడని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని బెదిరించినట్టు సమాచారం. 
 
ఇలాంటి ఆరోపణలు ఉన్న సమయంలోనే జీసీ నెట్ వర్క్ పై దాడి చేయడంతో వైఎస్ఆర్ సిపికి మంచి అవకాశం దొరికింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటిరాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం సాయంత్రం ధ్వంసమైన కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ ఆవరణలో విలేకర్లతో మాట్లాడారు.
 
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గత జీవితం పరిశీలిస్తే ఇటువంటి దారుణాలు వారే చేయించారనటంలో ఎటు సందేహాలు లేవని చెప్పారు. స్పీకర్ నియోజకవర్గం కాకపోయినా నరసరావుపేటలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని కాదని పెత్తనం చేస్తున్నారన్నారు. వ్యాపారవర్గాలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఇది స్పీకర్ ప్రోత్సాహంతోనె జరుగుతోందని విమర్శించారు. దీనికి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని మండిపడుతున్నారు. 
 
ముప్పాళ్ళ మండల ఎంపీపీ ఎన్నిక సందర్బంగా మెజార్టీలేకపోయినా ఎంపీటీసీలను అపహరించిన ఘటనలో అసలైనవారిని వదిలేసి చేసిన అనామకులను పట్టుకొని కేసును నీరుగార్చారన్నారు. పోలీసు వ్యవస్థ కోడెల చెప్పినట్లుగా నడుస్తోందన్నారు. పోలీసులు పాత్రధారులు, సూత్రధారులను సైతం అరెస్టుచేసి తమ నిజాయతీని నిరూపించుకోవాలని కోరారు. ఆయన కుమారుడే ఇక్కడ అన్ని తానై ఈ దౌర్జన్యాలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 
 
జీసీ టీవీ కార్యాలయంపై శివరామకృష్ణే దాడిచేయించారని ఆరోపించారు. గతంలో ఎంపీటీసీల అపహరణ, విశాఖపట్నంలో తన కుమారుడిని అపహరించటం, రాత్రికి రాత్రి దాడి చేయటం మూడు సంఘటనలు పరిశీలిస్తే ఒకదానికొకటి, ఒకే వ్యక్తి చేయించినట్లుగా ఉందన్నారు. వ్యాపారులను బెదిరిస్తూ వాటన్నింటిన తన గుప్పిట్లోకి తీసుకోవాలనే ఆలోచనతో తొమ్మిది నెలలుగా నియోజకవర్గంలో అరాచక పాలన నడిపిస్తున్నారన్నారు.
 
ఈ సంఘటనలన్నింటిని వెలుగులోకి తీసుకువస్తూ.. కోడెల శివప్రసాద్ రావు దూకుడుకు శాసనసభ వెలుపల ముకుతాడు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చివరకు ఆయన శాసనసభాధ్యక్షుడుగా ఉన్న సభలోనే కోడెల శివప్రసాద్ రావుపై చర్చిస్తామని వైఎస్ఆర్ సిపి బహిరంగంగానే చెబుతున్నారు. మరీ పర్యావసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.