శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (16:09 IST)

నైట్ షిప్టులు చేస్తున్నారా.. అయితే ఊబకాయం ఖాయం!

నైట్ షిఫ్టులలో పనిచేసే ఉద్యోగులు ఊబకాయులుగా తయారుకావడం ఖాయమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రాత్రివేళల్లో పనిచేసే వారి శరీరానికి సంబంధించిన సహజ జీవప్రక్రియ మందగిస్తుందనీ.. తద్వారా శరీరంపై, గుండెపై ఒత్తిడి పెరిగి ఒబేసిటీ, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. 
 
రాత్రి పని వేళల్లో పనిచేసి, పగలు నిద్ర పోయేవారి శారీరక ధర్మాలలో అనేక అపశ్రుతులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ కారణంగా శరీరం తీసుకునే కేలరీలను ఖర్చు చేయడం బాగా తగ్గిపోతుందనీ.. దీంతో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల బారిన పడతారని ఆయన ఉటంకించారు.
 
సుదీర్ఘకాలం నైట్ షిఫ్టుల వలన శరీర బరువును నిర్ణయించే లెప్టిన్, ఇన్సులిన్, కార్టిసోల్ లాంటి పదార్ధాల నియంత్రణా వ్యవస్థ దెబ్బతింటుందనీ... దాంతో మధుమేహం, కార్డియోవస్కులర్ జబ్బులు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఫ్రాంక్ టెలిగ్రాఫ్‌కు వివరించారు.
 
హార్వార్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ఈ అధ్యయనం కోసం.. ఐదుగురు మహిళలతో పాటు పదిమంది వాలెంటీర్లను ఎంపిక చేసి, పది రోజుల పాటు నైట్ షిఫ్టులో పనిచేసిన వాతావరణాన్ని వారికి కలిగించి అధ్యయనం చేసినట్లు ఫ్రాంక్ పేర్కొన్నారు. ఈ వాలెంటీర్లను పగటి పూట తిని నిద్రపోయేట్లు చేసి, ఆ సమయంలో వారి గుండె కొట్టుకునే రేటు, శారీరక ఉష్ణోగ్రతలను పరిశోధకులు నిరంతరాయంగా గుర్తించగా, ఆ సమయంలో వాలెంటీర్ల జీవ ప్రక్రియ మందగించినట్లు తాము కనుగొన్నట్లు ఫ్రాంక్ తెలిపారు.
 
ఈ సందర్భంగా వాలెంటీర్ల వత్తిడికి సంబంధించిన, హుషారుకు సంబంధించిన హార్మోన్ల స్థాయిలను పరిశీలించగా... గతంలో మధుమేహ లక్షణాలు లేని ఇద్దరి శరీరంలో ఆ లక్షణాలు అభివృద్ధి చెందినట్లు గుర్తించామనీ ఫ్రాంక్ చెప్పారు. ఈ ప్రభావాలన్నింటినీ క్రోడీకరిస్తే ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం లక్షణాలు నైట్ షిఫ్టులు చేసే ఉద్యోగుల్లో పెరిగినట్లు తమ పరిశోధకులు గుర్తించినట్లు ఫ్రాంక్ తెలియజేశారు.