శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 27 జూన్ 2019 (22:34 IST)

ఇలాంటి స్నానం చేస్తున్నారా లేదా..? చేస్తే ఏమవుతుంది?

శరీరానికి నూనెతో మర్థనా గావించి, తరువాత స్నానము చేయుట చాలా మంచిది. దీనివలన సర్వాంగాలకు పుష్టి కలుగును. ఆవనూనె, గంధపుచెక్కల నుండి తీసిన నూనె, సుగంధ ద్రవ్యముల నుండి తీసిన నూనెలు, పుష్పములు నుండి లభించు నూనెలను అభ్యంగనానికి ఉపయోగించవచ్చును.
 
అభ్యంగనమువలన- వాత, కఫ దోషములు హరించును. శారీరక బడలికను పోగొట్టి- బలాన్ని కలిగిస్తుంది. దేహకాంతి, మంచి కంటిచూపు, సుఖనిద్రను కలిగిస్తుంది. ఆయుష్షును వృద్ధిచేస్తుంది.
 
ప్రతిరోజూ చెవులలో కొద్దిగా తైలపుచుక్కలు వేసుకోవడం వలన చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శబ్ధగ్రహణము బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా వుంటాయి.
 
ప్రతిరోజూ పాదములకు తైలముతో మర్థనా చేయుటవలన పాదములలో బలము వృద్ధిచెందుతుంది. మొద్దుబారిన పాదాలు స్పర్శా జ్ఞానములను సంతరించుకుంటాయి. పాదములు మీద పగుళ్ళను పోగొడతాయి. దీనివలన నేత్రములకు కూడా చలువచేస్తుంది. కళ్ళు ప్రకాశవంతమవుతాయి. సుఖనిద్రకలుగుతుంది.
 
శిరస్సు మీద నూనె మర్దనాచేయుట వలన-మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళు-చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగము వలన-తైలము రోమకూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురుకుదనాన్ని కలిగిస్తుంది. ధాతువులను వృద్ధిచేస్తుంది.
 
వివిధ రకములు జ్వరములతో బాధపడేవారు, అజీర్ణవ్యాధులతో బాధపడేవారు, విరేచనములగుటకు ఔషదము తీసుకొన్నవారు తైలముతో అభ్యంగము చేయకూడదు. శరీరానికి తైలముతోపాటు...నలుగుపిండిని పూసి, బాగా మర్దనాచేస్తూ పొట్టుగా శరీరమునుండి రాలిపోవునంత వరకూ చేసి-స్నానము చేసిన, కఫమును పోగొడుతుంది. బలాన్ని వృద్ధిచేస్తుంది. రక్తం శుద్ది అవుతుంది. చర్మం మృదువుగా వుంటుంది. నేత్రములకు చలువచేసి కాంతివంతమవుతాయి. ముఖ వర్చస్సు పెరుగుతుంది.
 
స్నానం ద్వారా శరీరమును శుభ్రపరచుకొనుట వలన-శరీరము మీద మాలిన్యములు తొలగిపోతాయి. దురదలు, మంటలు వుండవు అలసట పోయి ఉత్సాహము కలుగుతుంది. కునికిపాట్లు, బద్దకం నశిస్తాయి తప్పి, తాపము తగ్గుతాయి. శరీరానికి బలమును కలిగిస్తుంది.