శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (09:16 IST)

తింటూనే బరువును తగ్గించుకోవచ్చు....ఎలా?

కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తినడం మానేస్తే బరువు తగ్గొచ్చని చాలా మందిలో అపోహ ఉంది. మనలో అధిక శాతం మంది ఇలానే భావిస్తారు. కేవలం భావించడమే కాదు అదే రీతిలోనే ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. అయితే అలా మార్చుకోకుండా కొవ్వులు ఉన్న పదార్థాలను తింటూనే సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు కూడా. అలాంటి ఆహారం గురించి తెల్సుకుందాం!
 
చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి అందే క్యాలరీలను నియంత్రణలో ఉంచే లెప్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అయితే చేపలను వేపుడుగా కాకుండా ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ఫలితం ఉంటుంది.
 
నిమ్మ, ద్రాక్ష, నారింజ, బత్తాయి పండ్లలోతోపాటు సి విటమిన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని కొవ్వును కరిగించే పలు రసాయనాలను సి విటమిన్ ఉత్పత్తి చేస్తుంది. వీటిని తక్కువ మొత్తంలో తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపటి వరకు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
 
జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి పాప్‌కార్న్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
 
ఓట్స్‌లో ఉండే సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్స్ వల్ల అవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీని వల్ల ఓట్స్‌ను తింటే త్వరగా ఆకలి వేయదు. కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా మంచి చేస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. వెన్న తీసిన పాలు, పెరుగులో ఓట్స్‌ను వేసి ఉడికించి తింటే ఇంకా చక్కని ఫలితం ఉంటుంది.
 
బీన్స్‌లో ప్రోటీన్లు, ఫైబర్ వంటివి ఎక్కువగా మోతాదులో ఉంటాయి. ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు.
 
జొన్నలు, సజ్జలు, రాగులు తీసుకుంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి. రక్తంలోకి నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తాయి. దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. ఇవి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి.
 
ఒక యాపిల్ పండు తింటే కొద్దిసేపటి వరకు ఆకలి వేయదు. ఎందుకంటే యాపిల్స్‌లో నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. రోజుకో యాపిల్‌ను తింటే చక్కని ఫలితం ఉంటుంది.