శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 19 మే 2016 (21:55 IST)

మీ వేలి గోళ్లు చెపుతాయి మీ ఆరోగ్యం గురించి....

గోళ్లను గురించి మనం తెలుసుకోవలసిన, చాలా మందికి తెలియని విషయాలు చాలా వున్నాయి. గోళ్లు అరిగిపోకుండా అందంగా కనిపించాలంటే వాటికి బలం కావాలి. జట్టులాగానే గోళ్లు కూడా కెరటిన్‌ ప్రొటీన్‌తో ఏర్పడతాయి. గోళ్లలో తేమ 18 శాతం ఉంటే గోళ్ల నాణ్యతకి మంచిది. గోరులో మూడు ముఖ్య భాగాలుంటాయి. 1. చివరి అంచు, 2. అసలు గోరు, 3. గోరు మొదలు. కెరటిన్‌ గోరు పీఠం వద్ద తయారవుతుంది. గోరుచుట్టూ వుంటే పొరను క్యూటికిల్‌ అంటారు. గోళ్ల ఆకారాలలో చాలా రకాలున్నాయి. ప్రధానంగా చదరం, గుండ్రం, అండాకారం, కూసుగా వుండేవి. 
 
గోళ్ల స్వభావం ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా వుంటుంది. కొందరిలో అవి మందంగా, వేగంగా పెరగవచ్చు. లేదా పగిలి ముక్కలయ్యేవి. చీలిపోయేవి. పొరలు పొరలుగా వూడిపోయేవి కావచ్చు. గోరు నెలకి సుమారు 2 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుందని నిపుణులు చెపుతున్నారు. శీతాకాలంలో కన్నా వేసవిలో ఎక్కువ వేగంగా పెరుగుతాయి. మధ్య వేలు గోరు అన్నింటికన్నా వేగంగా పెరుగుతుంది. బొటనవేలు గోరు అతి నెమ్మదిగా పెరుగుతుంది. కాలి వేళ్ల గోళ్లు చేతి గోళ్ల కన్నా మందంగా, గట్టిగా వుంటాయి. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. గర్భవతుల గోళ్లు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల ఎక్కువ వేగంగా పెరుగుతాయి. గోళ్లని ఎప్పుడూ తవ్వడానికి, గిచ్చడానికి ఉపయోగించకూడదు. గోల్లను ఎప్పుడూ పూర్తిగా తెంచివేయకూడదు. మరీ ఎక్కువ పొడవుగా పెంచకూడదు. వేలు కొస వరకు పెరిగితే చాలు. 
 
ఆరోగ్య పరీక్షల్లో డాక్టర్లు గోళ్లు కూడా పరీక్షిస్తారు. ఎందుకంటే అవి మన ఆరోగ్యాన్నే కాకుండా మనం ఏం తింటున్నాం? ఏం లోపించింది కూడా తెలియజేస్తాయి. గోళ్లు పలుచగా వున్నా, లేదా గోళ్ల మీద తెల్లని మచ్చలు, గాట్లు గానీ ఉన్నా శరీరంలో జింక్‌ లోపం వున్నట్లు అర్థం, కనుక ఎక్కువ చిక్కుళ్లు, పప్పు దినుస్సులు, పుట్టగొడుగులు, యీస్ట్ ఎక్కువగా తినాలి. గోళ్లు చంచా ఆకారంలో ఉంటే శరీరంలో ఐరన్ లేదా విటమిన్‌ ఏ లేదా రెండూ లోపించి ఉన్నాయని గ్రహించాలి. ఆకుకూరలు, మొలకలు, క్యారట్‌లు, పుచ్చకాయ, గుమ్మడికాయ మొదలైనవి తినాలి. 
 
గోళ్లు పెళుసుగా వుంటే బయోటిన్‌ లోపం వున్నట్లు లెక్క. అలాంటప్పుడు పుట్టగొడుగులు, పుచ్చకాయ, పంపర పనస, అరటి పళ్లు తినాలి. గోళ్లు విరిగిపోయేట్లు, నిలువు, అడ్డగాట్లు వుంటే విటమిన్‌ బి లోపం వున్నట్లు తెలుస్తుంది. క్యారట్‌లు, పాలకూర మొదలైవి తినాలి. గోళ్లు బాగా పెరగకపోతే జింక్‌ లోపం అనుకోవాలి. గోళ్లు వేలాడి పోతున్నట్లు, నొప్పిగా ఎరగ్రా వాచినట్లుంటే ఫోలిక్‌ యాసిడ్‌ విటమిన్‌ సి వున్న ఆహారాలు తినాలి. చిక్కుళ్లు, నారింజ, నిమ్మ, జామ, ఉసిరి, ఆకుకూరలు తినాలి. ఇలా గోళ్ల సంరక్షణకు ప్రాధాన్యతమివ్వాల్సి ఉంటుంది.