శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By CVR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (18:00 IST)

స్నేహితులతో సెల్ఫీనా... జాగ్రత్త! పొంచి ఉన్న ప్రమాదం..

ఇటీవల సెల్ఫీల మోజు బాగా పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఒకరిద్దరు, గుంపుగా చేరి మొబైల్ ఫోన్లతో సెల్ఫీ ఫోటోలు దిగుతున్నారు. సెల్ఫీ మోజులో ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటనలూ అనేకం. సామాజిక మాధ్యమాలలో తమ ఫోటోలను అప్ చేయడం, తద్వారా వచ్చే లైక్స్ వంటివే యువతను సెల్ఫీల ఊబిలోకి నెడుతున్నట్టు తెలుస్తోంది.
 
అత్యధికంగా సెల్ఫీ తీసుకోవడం కూడా మానసిక సమస్యగా అమెరికా వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషయం పక్కనపెడితే సెల్ఫీలు తీసుకోవడం వలన తలలో పేలు ఒకరి నుంచి ఒకరికి పాకే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలుపుతున్నారు. సెల్ఫీలు తీసుకునే సమయంలో యువత ఒకరిపై ఒకరు వాలి, తలలను దగ్గరగా చేర్చి సెల్ఫీకి పోజులిస్తున్నారు. 
 
ఆ సమయంలో ఒకరి తల నుంచి మరొకరికి పేలు పాకుతున్నాయి. కనుక సెల్ఫీలు తీసుకునే వారు ఒకరి తల మరొకరికి తగలని విధంగా పోజు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విధంగా సెల్ఫీలు తీసుకునే అమ్మాయిలకు తలలో ఎక్కువగా పేలు పెరగడం, చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.