శివలింగాన్ని ఇంట్లో వుంచితే దోషముండదు.. మహిళలు కూడా?

శివలింగాన్ని ఇంట్లో వుంచుకోవచ్చా? ఇంట్లో వుంచుకుంటే దోషమా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం చదవండి. శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోదలిచితే.. అభిషేకం

selvi| Last Updated: శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:28 IST)
శివలింగాన్ని ఇంట్లో వుంచుకోవచ్చా? ఇంట్లో వుంచుకుంటే దోషమా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం చదవండి. శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోదలిచితే.. అభిషేకం తప్పనిసరి. ప్రతిరోజూ శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంట్లో శివలింగాన్ని నెలకొల్పి పూజించుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసుకోవాలి.

ఆపై కలశంలో పవిత్రమైన నీటిని తీసుకుని.. గంగా గంగ గంగ అంటూ తర్వాత.. ''శ్రీ గంగా సహిత ఉమా మహేశ్వరాభ్యాం నమః ధ్యానం సమర్పయామి'' అని అక్షితలు వేయాలి. లింగాన్ని పళ్ళెంలో పెట్టి అభిషేకం చేయాలి. అభిషేకం అయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టి ఉంచి దీపారాధన చేయాలి.

ఇంట్లోని పూజా గదిలో వుండే పటాలు, ప్రతిమలకు రోజూ పూజ, నైవేద్యాలు అవసరం లేదు. కానీ లింగాన్ని ఇంట్లో వుంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం రోజూ పూజ, అభిషేకం, చేతనైన నైవేద్యం అవసరం. ఒక్కసారి పూజించిన శివలింగాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు. భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తర్వాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది.

సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తులను, వాటి ప్రయోజనాలను మనకు రాబట్టేది శివలింగం. అంతటి శక్తివంతమైన లింగానికి నిత్యపూజ చేయడం కనీస ధర్మం. నిత్యపూజకు లోటు రానీయకుండా.. అభిషేకం చేయాలి. శక్తి కొద్దీ భక్తి లోపం కాకుండా అభిషేకం చేయగలిగితే చాలు. అభిషేకం చేస్తున్నప్పుడు శివ పంచాక్షరి అయిన ''ఓం నమశ్శివాయ'' అంటూ అభిషేకం చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

అంతేగాకుండా మహిళలు కూడా శివలింగాన్ని ఇంట్లో వుంచి రోజూ పూజ చేసుకోవచ్చునని.. నెలసరి సమయాల్లో మాత్రం పూజకు దూరంగా వుండి.. ఏడు రోజుల తర్వాత మళ్లీ లింగ పూజ ప్రారంభించవచ్చునని వారు సూచిస్తున్నారు. మహిళలు లింగానికి పూజలు చేయకూడదనే నియమం లేదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. లింగ పూజ, విఘ్నేశ్వర పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని వారు చెప్తున్నారు. ఇంకా కార్తీక మాసమంతా ఇంట్లో వుంచి శివలింగానికి పూజలు, అభిషేకాలు చేస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందట.దీనిపై మరింత చదవండి :