శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2016 (20:08 IST)

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. అమెరికాకు నవాజ్ షరీఫ్.. 18 లేదా 19 తేదీల్లో?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరుకానున్నట్లు సమాచారం. ఇటీవల ట్రంప్.. నవాజ్‌తో ఫోన్‌ల

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరుకానున్నట్లు సమాచారం. ఇటీవల ట్రంప్.. నవాజ్‌తో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం నవాజ్ షరీఫ్ పర్యటనపై ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా వెళ్లి ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనాలని షరీఫ్ ఉవ్విళ్లూరుతున్నట్టు పాక్ మీడియా పేర్కొంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చేనెల 18 లేదంటే 19 తేదీల్లో అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ మేరకు షరీఫ్ పర్యటనను ఖరారు చేసేందుకు విదేశీ వ్యవహారాలపై ఆయన ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి నేడు అమెరికా బయలుదేరనున్నారు. ఫతేమి అమెరికాలో పది రోజులు ఉంటారని తెలుస్తోంది. ట్రంప్, ఆయన బృందాన్ని కలిసి పాకిస్థాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చిస్తారని సమాచారం.
 
కాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఫోన్‌చేసి అభినందించారు. ఈ సందర్భంగా షరీఫ్‌తోపాటు, పాకిస్థాన్‌పై, పాకిస్థానీలపై ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపించినట్టు పాక్‌ ప్రధాని కార్యాలయం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన ట్రంప్‌.. అధ్యక్షుడైన వెంటనే తన వైఖరి మార్చుకున్నారా? అన్న విస్మయం వ్యక్తమైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్‌ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్‌ మాత్రమేనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.