శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (17:50 IST)

సైనిక సంపత్తిలో అగ్రరాజ్యం అమెరికాను మించిన చైనా.. నిజమేనా?

సైనిక సంపత్తిలో అగ్రరాజ్యం అమెరికాను చైనా మించిపోయిందా? అవుననే అంటున్నారు చైనా రక్షణ రంగ నిపుణులు. అయితే, అన్ని విభాగాల్లో ఇది సాధ్యపడలేదని, కొన్ని విభాగాల్లో మాత్రం చైనాతో సరితూగలేని పరిస్థితుల్లో అమెరికా ఉందని చెపుతున్నారు. దీనికి ఉదాహరణగా చైనా తాజాగా తన సైనిక సంపత్తితో నిర్వహించిన ప్రదర్శనే కారణంగా ఉంది. 
 
జపాన్‌పై యుద్ధం గెలిచి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో చైనా చేపట్టిన కార్యక్రమాలు, ఆ దేశ ఆయుధ సంపత్తిని ప్రపంచ ప్రజలకు తెలియజెప్పేలా భారీ ప్రదర్శన నిర్వహించాయి. వందలాది రకాల ఆయుధాలను చైనా తొలిసారిగా బయటి ప్రపంచానికి కంటబడేలా ప్రదర్శించింది. చైనా వద్ద ఉన్న విమాన విధ్వంసక క్షిపణులు, ట్యాంకులు, యుద్ధ విమానాలు, స్టెల్త్ ఫైటర్లు, హెవీ యూఏవీలు (మానవరహిత భారీ విమానాలు), లాంగ్ రేంజ్ మిసైల్స్, కొత్తగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రాడార్ విమానాలు, ఖండాంతర క్షిపణులు, తేలికపాటి బాంబర్ విమానాలు, హెవీ మోర్టార్లు... ఇలా తన వద్ద ఉన్న ఎన్నోరకాల అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించింది.
 
ఇవన్నీ అమెరికాతో పోలిస్తే, చైనా రక్షణ బడ్జెట్ తక్కువే అయినప్పటికీ, పలు విభాగాల్లో అగ్రరాజ్యాన్ని మించిపోయింది. చైనాలో 23.33 లక్షల మంది సైన్యం ఉండగా, అమెరికాలో ఈ సంఖ్య 14.33 లక్షలు మాత్రమే. ఇక అమెరికా వద్ద 2,785 యుద్ధ ట్యాంకులుండగా, చైనా వద్ద 6,540 ఉన్నాయి. అమెరికాలో 2,396 యుద్ధ విమానాలు ఉండగా, చైనా వద్ద 1,667 ఉన్నాయి. సబ్ మెరైన్ల సంఖ్య అమెరికాలో 73 కాగా, చైనాలో 69 ఉన్నాయి. యుద్ధ విమానాలను తీసుకెళ్లగల భారీ నౌకలు అమెరికా వద్ద 10 ఉండగా, చైనా దగ్గర ఒకటి మాత్రమే ఉంది. ఖండాంతరాలకు దూసుకెళ్లే మాలిస్టిక్ మిసైల్స్ చైనా వద్ద 66 ఉండగా, అమెరికా వద్ద 450 ఉన్నాయి.