శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 4 జులై 2015 (18:32 IST)

మొసలికి ముద్దుపెట్టు.. అక్కడ ఉద్యోగం పట్టు..!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని సంస్థల వాళ్లు తమ ఉత్పత్తులను వినియోగదారుల వద్దకు చేర్చడానికి వినూత్న రీతుల్లో పోటీపడుతున్నారు. ఈ కోవలో తొలిసారిగా చైనాకు చెందిన ఒక సంస్థ ఉద్యోగులను చేర్చుకోవడానికి వినూత్న రీతిలో, అభ్యర్థులను భయాందోళనకు గురిచేసే ఇంటర్వ్యూలను పెట్టింది. వివరాల్లోకి వెళితే.. చైనా దేశంలో ఉన్న కాంగ్టాన్ ప్రాంతంలోని కాంగోలి అనే ప్రాంతంలో ఆరోగ్య సంబంధిత వస్తువుల తయారీ సంస్థ ఉంది. 
 
ఆ సంస్థలో కొత్తగా తొమ్మిది మంది ఉద్యోగులను చేర్చుకోదలచినట్టు ప్రకటన ఇచ్చారు. దీంతో అక్కడికి వందల సంఖ్యలో అభ్యర్థులు చేరుకున్నారు. అయితే ఆ ఉద్యోగాలు మహిళకు మాత్రమే అని తెలుపడంతో అబ్బాయిలు వెనుతిరిగారు. ఆ సంస్థ అమ్మాయిలకు వినూత్న రీతిలో ప్రాణాంతకమైన పరీక్ష పెట్టింది. ఆ సంస్థ పెట్టిన ఇంటర్వ్యూలో తొలి రౌండ్‌లోనే కొందరు అమ్మాయిలు బంబేలెత్తారు. 
 
ఆ సంస్థ పెట్టిన పరీక్ష ప్రాణాలతో ఉన్న మొసలికి ముద్దు పెట్టాలి. ఆ విధంగా ధైర్యంతో బ్రతికి ఉన్న మొసలికి ముద్దు పెట్టే అభ్యర్థులు తర్వాత రౌండ్‌కు వెళ్లడమే కాకుండా, వారికి 1000 రూపాయల నజరానాను కూడా సంస్థ ప్రకటించింది. అయితే ఆ మొసలి నోటిని, కళ్లను కట్టేసి ఉంటారు. 
 
దీనిపై సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ.. మొసలి నుంచి తీస్తున్న రసాయనంతో తయారుచేస్తున్న వస్తువులను తమ సంస్థ విక్రయిస్తుండడం వలన, మొసలి అంటే భయం పోవాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. 
 
చైనాలో మొసలి మాంసం ఆరోగ్యకార వస్తువుల తయారీకి అనువైనదిగా ఉన్నట్టు కొన్ని ప్రాంతాలలో ప్రజలు నమ్ముతున్నారు. అక్కడి వారు మొసలి మాంసాన్ని వివిధ రూపాలలో రుచికరంగా తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇంకా మొసలి మాంసంతో ఔషధాలను కూడా తయారుచేస్తున్నారు. ఈ వినూత్న ఇంటర్వ్యూ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతోంది.