శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 ఫిబ్రవరి 2015 (14:39 IST)

గర్భవతి అయిన భార్యను మింగేసిన మొసలిని చంపేసిన భర్త!

గర్భవతి అయిన భార్యను మొసలి మింగేసిందని తెలియడంతో ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. అంతేకాదు.. ఆ మొసలిని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఘటన యుగాండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యుగాండాలో నాలుగు నెలల క్రితం ముబారక్ బటాంబుజే భార్య దిమెత్రియో నబిరే (గర్భిణీ) తన గూడెం మహిళలతో కలిసి నీళ్లు తీసుకురావడానికి క్యోగా సరస్సు దగ్గరికి వెళ్లింది.

నీళ్ల కోసం సరస్సులోకి దిగీదిగగానే అమాంతంగా ఒక మొసలి ఆమెపై పడి నీటిలోకి ఈడ్చుకుని పోయి ఆమెను పొట్టనబెట్టుకుంది. దీంతో భర్త శోకంలో మునిగిపోయాడు. ఈ మధ్య ఆ మొసలి మరోసారి కనిపించిందని ఆ నోటా ఈ నోటా విన్న ముబారక్ ఎలాగైనా తన కుటుంబాన్నే మింగేసిన మొసలిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. 
 
తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి దాన్ని కనుగొన్నాడు. దానిని కర్రలు, రాళ్లతో చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ఏమీ చేయలేకపోయారు. దీంతో స్ధానికంగా ఉండే ఓ కమ్మరి దగ్గరికి వెళ్లి తానేం చేయాలనుకుంటున్నాడో అతడికి వివరంగా చెప్పాడు.
 
దీంతో ఆ కమ్మరి ప్రత్యేకమైన ఈటెను తయారు చేశాడు. దాంతో ఆ మొసలిపై గంటన్నర సేపు పోరాడి చివరికి దానిని అంతం చేసి తన భార్య చావుకి కారణమైన మొసలిపై భర్త ప్రతీకారం తీర్చుకున్నాడు.