శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (08:45 IST)

దావూద్ ఇబ్రహీంకు ఐఎస్ఐ ఉన్నత స్థాయి భద్రత!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనీవినీ ఎరుగని భద్రతను కల్పించి, కంటికి రెప్పలా కాపాడుతోంది. ఈ విషయంలో తమను ఎవరేమన్నా పట్టించుకునే స్థితిలో ఐఎస్ఐ లేదు. ఎప్పటికప్పుడు అతడికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్న ఆ సంస్థ, తాజాగా మునుపెన్నడూ లేనిరీతిలో భద్రతను పెంచినట్టు పాక్ మీడియాలో వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. 
 
దావూద్ ఇబ్రహీం కోసం అటు అమెరికా, ఇటు భారత్ నిఘా పెట్టి, అతని వేటను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న పాకిస్థాన్ ఐఎస్ఐ... అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను తోసిరాజని, అతడు కోరిన కోర్కెలన్నింటినీ తీరుస్తూ తరిస్తోందని తాజాగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. 
 
అప్పటిదాకా దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన దావూద్, ముంబై పేలుళ్ల నేపథ్యంలో ఒక్కసారిగా ఐఎస్ఐకి కీలక భాగస్వామిగా మారాడు. అప్పటి నుంచి కరాచీలోనే మకాం వేసిన దావూద్, ఎప్పడు బయటికెళ్లినా, ఐఎస్ఐ అతడి వెన్నంటే ఉంటోంది.
 
పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను రక్షించుకోలేకపోయిన ఐఎస్ఐ, దావూద్‌పై ఈగ వాలితే కూడా సహించడం లేదు. ఐఎస్ఐలో పదవీ విరమణ పొందిన సీనియర్ అధికారులను దావూద్ కు వ్యక్తిగత భద్రత సిబ్బందిగా పనిచేసేందుకు అనుతిస్తున్న ఐఎస్ఐ, అతడికి భారత్ నుంచి నకిలీ పాస్ పోర్టులను అందించే పనిని కూడా చేసి పెట్టింది.