మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi

అమెరికాలో రీకౌంటింగ్ ప్రకంపనలు : మండిపడిన డోనాల్డ్ ట్రంప్.. హిల్లరీ చిరు ఆశ

అమెరికాలోని స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటూ, అతికొద్ది ఓట్ల మెజారిటీతో ట్రంప్‌ను గెలిపించిన విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిపై ఆ దేశానికి కొత్త అధ్యక్షు

అమెరికాలోని స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటూ, అతికొద్ది ఓట్ల మెజారిటీతో ట్రంప్‌ను గెలిపించిన విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిపై ఆ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. పైగా ఈ రీకౌంటింగ్‌ ఈ ప్రక్రియలో హిల్లరీ క్లింటన్ కూడా పాల్గొనాలని నిర్ణయించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
తాము విస్కాన్సిన్ రీకౌంటింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించినట్టు హిల్లరీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తం 30 లక్షల ఓట్లను ఒక్కోటిగా పరిశీలించనుండగా, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ డిమాండ్ మేరకు రీకౌంటింగ్‌కు అధికారులు నిర్ణయించారు. 
 
అయితే, తొలుత తాము రీకౌంటింగ్ను కోరుకోలేదని క్లింటన్ ప్రచార బృందం ప్రతినిధి మార్క్ ఎలియాస్ వెల్లడించారు. ఓటింగ్ వ్యవస్థను హ్యాక్ చేశారనడానికి తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని, అయితే, ఇప్పుడు రీకౌంటింగ్ జరుగుతోంది కాబట్టి తాము ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు. 
 
రీకౌంటింగ్‌ ఒక స్కాం అని, గ్రీన్‌ పార్టీ తమ ఖజానాను నింపుకోవడానికే రీకౌంటింగ్‌ను తెరపైకి తెచ్చిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. నైతికంగా దివాళా తీసిన డెమొక్రాట్లు దీనికి మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. రీకౌంటింగ్‌ వల్ల గెలుపు వరిస్తుందేమోనన్న తప్పుడు ఆలోచనతో డెమొక్రాట్లు ఉన్నారని సీరియస్‌ అయ్యారు. అమెరికాలో ఇలా ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు.
 
డొనాల్డ్‌ ట్రంప్‌ స్వల్పతేడాతో గట్టెక్కిన మూడు రాష్ట్రాలైన విస్కాన్సిన్‌, మిచిగన్‌, పెన్సిల్వేనియాలలో రీకౌంటింగ్‌ జరుపాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. గ్రీన్‌ పార్టీ అభ్యర్థి జిల్‌ స్టీన్‌ చేసిన ఈ డిమాండ్‌ మేరకు విస్కాన్సిన్‌లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించడానికి ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. దీనిని హిల్లరీ వర్గం పరోక్షంగా స్వాగతిస్తుండగా.. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌ మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు.