శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (15:29 IST)

కో పైలట్ నడపడం వల్లే ఎయిర్ ఆసియా విమానం కూలింది..!

ఎయిర్ ఆసియాకు చెందిన క్యూజెడ్ 8501 విమానాన్ని కో పైలట్ నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్టు ఇండోనేషియా జాతీయ రవాణా భద్రతా కమిటీ తన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో వెల్లడించింది. గత డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ విమాన ప్రమాదంలో 162 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటివరకు 70 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి.  
 
కాగా ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తూ వచ్చిన జాతీయ రవాణా భద్రతా కమిటీ అధికారులు తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఆ విమానం ఆకాశంలో 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, ఆ సమయంలో అంతగా అనుభవం లేని కో పైలెట్ విమానాన్ని నడపడంతో, విమానం హఠాత్తుగా 37, 400 అడుగుల ఎత్తుకు దూసుకెళ్లినట్టు తెలిపారు.

అనంతరం ఒక్కసారిగా 24 వేల అడుగుల దిగువకు పడిపోయిందని కమిటీలో దర్యాప్తు అధికారిగా ఉన్న సీనియర్ పైలెట్ ఎర్తాట లానంగ్ వెల్లడించారు. కాగా అసలు ఉరుములు, మెరుపులు ఎక్కువగా వున్న ప్రాంతంలోకి విమానం ఎందుకు దూసుకెళ్లిందో తమకు అంతుచిక్కడం లేదని, ఈ అంశంపై ఇంకా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని దర్యాప్తు కమిటీలోని ఇతర సభ్యులు తెలిపారు.