సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (10:27 IST)

నైజీరియా జైలు మీద బాంబు దాడి.. 1800మంది ఖైదీలు పరార్.. ఆరుగురు..?

నైజీరియా ఐమో రాష్ట్రంలోని ఒక జైలు మీద బాంబు దాడి జరిగింది. కొంతమంది సాయుధులు ఓవేరీ పట్టణంలోని జైలులోకి చొరబడి అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు బాంబులతో పేల్చేశారు. ఇదే అవకాశంగా తీసుకొని 1,800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. అయితే.. ఈ ఘటన తరువాత 35 మంది ఖైదీలు పారిపోవడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయారు. మరో ఆరుగురు బయటికి వెళ్లి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. 
 
ఖైదీలు పారిపోయారని నైజీరియన్ కరెక్షనల్ సర్వీస్ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున సాయుధ గుంపులు బస్సులు, ట్రక్కులలో ఓవేరీ కస్టోడియల్ సెంటర్లోకి దూసుకొచ్చారని, వారి వద్ద బాంబులు, మెషీన్ గన్లతో పాటు రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
 
నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ ఈ ఘటనపై స్పందించారు. ఇది ఉన్మాదంతో కూడిన తీవ్రవాద చర్య అన్నారు. దాడి చేసిన వారిని, తప్పించుకున్న ఖైదీలను వెంటనే పట్టుకోవాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు.